ప్రజారోగ్య రక్షణే లక్ష్యం
● వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజారోగ్య రక్షణే లక్ష్యమని, పేదకు సైతం మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తోందన్నారు. ఆ మేరకు సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారితో స్నేహపూర్వకంగా మెలగాలని, నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కోరారు. ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో ఓపీ రోగులకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసే ఆరోగ్య భద్రత కార్డులను వందశాతం రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. గర్భిణులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రసవం తర్వాత తల్లీబిడ్డల ఆరోగ్య స్థితిగతులను ఆశ, ఏఎన్‌ఎంలు పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో సబ్ సెంటర్లు, పీహెచ్‌సీల్లో చిన్నపాటి మరమ్మతులను ప్రత్యేక డ్రైవ్ పెట్టి పూర్తి చేసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా మందులను నిల్వ చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో పరికరాల నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టాలని చెప్పారు. బయో మెడికల్ వేస్ట్‌ను పక్కాగా సేకరించి డిప్పోజ్ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ జిల్లాలో 459 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌లు (ఎంఎల్‌హెచ్‌పీస్), 540 ఏఎన్‌ఎంలు, 1526 ఆశా వర్కర్లు ఉన్నారన్నారు. 76,629 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 3,500 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించి కళ్లజోళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, దోమల నిర్మూలనకు అవసరమైన చర్యలను చేపడుతున్నామని వెల్లడించారు. జిల్లాలో 14 నవంబర్ 2024 నుంచి 15 జనవరి 2025 వరకు 612 సచివాలయాల పరిధిలో 84,579 గృహాల్లో సర్వే నిర్వహించమని వివరించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, డీఎంహెచ్‌ఓ సుధారాణి, డీసీహెచ్‌ఎస్ ప్రభావతి, పీఆర్‌ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్‌టీఆర్ వైద్య సేవ కో–ఆర్డినేటర్ సుదర్శన్, డీఐఓ హనుమంతరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment