సాక్షి, హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాతే విచారణకు పిలవాలని, అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. వాదనలు విన్న అనంతరం అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను నేటికి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సురేందర్ సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. వైఎస్ వివేకా హత్యకు ప్రధానంగా నాలుగు కారణాలున్నాయని న్యాయస్థానానికి నివేదించారు. ఒకటి.. ఆర్థికపరమైన విభేదాలు, రెండు.. కుటుంబ తగాదాలు, మూడోది.. మహిళలతో అక్రమ సంబంధాలు, నాలుగు.. రాజకీయ అంశాలున్నట్లు తెలిపారు.
ఇతర కోణాలు చాలా ఉన్నాయి..
‘కిరాయి హంతకుడు దస్తగిరి వాంగ్మూలం మినహా ఎలాంటి ఆధారం లేకుండా అరెస్టులు చేయడం చట్టవిరుద్ధం. ఇప్పటివరకు మెటీరియల్‌ను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. 2021 అక్టోబర్ 26న సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది. ఏ–1 నుంచి ఏ–4 వరకు నిందితులుగా పేర్కొంది. 2022 జనవరి 31న అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తూ ఏ–1 నుంచి ఏ–5 వరకు నిందితులుగా పేర్కొంది. సీఆర్‌పీసీ 160 కింద పిటిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 14వ తేదీల్లో 160 సీఆర్‌పీసీ కింద విచారణకు హాజరైన పిటిషనర్ వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసింది.
తనను సీబీఐ చిత్రహింసలకు గురిచేస్తోందని నిజం చెబుతానని దస్తగిరి పేర్కొనడంతో గంగిరెడ్డి వారించారని, భయపడాల్సిన పనిలేదని, మన వెనుక అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారని చెప్పినట్లు సీబీఐ పేర్కొంది. అంటే దస్తగిరిని చిత్రహింసలకు గురి చేసినట్లు తెలుస్తోంది. అందుకే సీబీఐ చెప్పినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. 2022 ఆగస్టులో సీబీఐకి అనుకూలంగా దస్తగిరి వాంగ్మూలం ఇవ్వడంతో రెండు నెలలు తిరగకుండానే అక్టోబర్‌లో ముందస్తు బెయిల్‌కు పూర్తిగా సహకరించింది. పిటిషనర్ పార్లమెంట్ సభ్యుడు. ఆయన పరువుకు భంగం కలిగేలా దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తోంది.
నిందితుడిగా పేర్కొంటూ మీడియాకు స్టేట్‌మెంట్లు ఇస్తోంది. పిటిషనర్ తండ్రి భాస్కర్‌రెడ్డి 75 ఏళ్ల వయసులో ఆరోగ్యం సహకరించకున్నా కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు నిందితులకు బెయిల్ ఇవ్వాలని గత తీర్పులు చెబుతున్నాయి. అసలు ఈ కేసులో ఆర్థిక, కుటుంబ, ఇతర తగాదాలు చాలా ఉన్నాయి. ఆ కోణంలో సీబీఐ కనీసం పరిశోధన చేయడం లేదు. వివేకా చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇందులో ఆయన వ్యతిరేకుల హస్తం కూడా ఉండవచ్చు’ అని నిరంజన్‌రెడ్డి నివేదించారు.
దస్తగిరి బెయిల్‌పై సునీత మౌనం..
‘వివేకాను హత్య చేసేందుకు నగదు తీసుకున్నానని, గొడ్డలి కూడా కొనుగోలు చేశానని దస్తగిరి ఒప్పుకున్నాడు. హంతకుడైన దస్తగిరిని కనీసం కస్టడీలోకి తీసుకుని విచారించకుండానే క్షమించడం చట్ట విరుద్ధం. అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చినా, అప్రూవర్‌గా పేర్కొన్నా వివేకా కుమార్తె సునీత కలుగజేసుకోవడం లేదు. అవినాశ్, భాస్కర్‌రెడ్డి దాఖలు చేసే పిటిషన్లలో మాత్రమే ఆమె ఇంప్లీడ్ అవుతోంది. సీబీఐ చెప్పినట్లుగా ఆమె వ్యవహరిస్తున్నారు. వివేకా తన వారసుడిగా రెండో భార్య కుమారుడిని ప్రకటించారు.
ఈ విషయంలో మొదటి భార్య, సునీత, అల్లుడితో తీవ్ర మనస్పర్థలు చోటుచేసుకుని తారాస్థాయికి చేరాయి. గంగిరెడ్డితో వివేకాకు నగదుకు సంబంధించిన విభేదాలు ఉన్నాయి. తన తల్లిని వివేకా లైంగికంగా వేధించారని సునీల్ యాదవ్ చెప్పాడు. ఆ క్రమంలో వివేకాపై సునీల్‌కు పగ ఉంది. ఇలాంటి వివాదాల నేపథ్యంలో జరిగిన హత్యపై ఏ ఒక్క అంశాన్ని సీబీఐ నిర్ధారణ చేసుకోలేదు. ఈ కేసులో సీబీఐ గత దర్యాప్తు అధికారిపై కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విచారణను తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆయనపై స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఇది అక్కడి కోర్టులో పెండింగ్‌లో ఉంది’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు.
రంగన్న స్టేట్‌మెంట్ ఎందుకు పరిగణనలోకి తీసుకోరు..?
‘వివేకా వాచ్‌మెన్ రంగన్న స్టేట్‌మెంట్‌ను సీఆర్‌పీసీ సెక్షన్ 161, 164 కింద దర్యాప్తు సంస్థ రికార్డ్ చేసింది. దాని ప్రకారం హత్య జరిగిన రోజు రంగన్న నిద్రలో ఉండగా అకస్మాత్తుగా పాత్రలు, ఇనుప రాడ్ పడిపోవడం లాంటి శబ్దాలు వినపడటంతో పార్క్ వైపు ఉన్న ద్వారం పక్క కిటికీ నుంచి లోపలికి చూశాడు. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్‌ను అతడు గుర్తించాడు. నాలుగో వ్యక్తి పొడవుగా, సన్నగా ఉన్నట్లు చెప్పాడు. వారంతా వెళ్లాక రంగన్న లోపలికి వెళ్లి చూడగా బాత్రూమ్‌లో రక్తపు మడుగులో వివేకా పడి ఉన్నారు. ఇదే విషయాన్ని రంగన్న స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.
విచారణ స్థలంలో దొరికిన ఆధారాలు రంగన్న చెప్పిన వివరాలతో సరిపోలడంతో పాటు బలాన్ని చేకూర్చింది. దీన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవడం లేదు. సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో ఫుటేజీని, పోలీసులు సేకరించిన మెటీరియల్‌ను సీబీఐ పరిశీలించలేదు. సీబీఐ కౌంటర్‌ను పరిగణనలోకి తీసుకుని దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇవ్వడం, అప్రూవర్‌గా అనుమతించడం చట్ట వ్యతిరేకం. విచారణకు సహకరించేందుకు అవినాశ్ సిద్ధంగా ఉన్నారు.
ఆయన్ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించాలి’ అని నిరంజన్‌రెడ్డి కోరారు. అనంతరం సీబీఐ పీపీ వాదనలు వినిపించారు. 160 కింద నోటీసులు ఇచ్చి ఎలా అరెస్టు చేస్తారు? అని ఈ సందర్భంగా సీబీఐని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు హాజరయ్యారు. అరెస్టు చేయలేదు. ఇప్పుడు అందుకు అవకాశం ఉందా?’ అని ప్రశ్నించగా దీనికి పీపీ బదులిస్తూ.. విచారణకు హాజరయ్యారని, విచారణ మేరకు అదుపులోకి తీసుకునే చాన్స్ ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment