గూండారాజ్‌.. రాజకీయ కక్షతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య | YSRCP worker was brutally Assassinated by TDP political faction | Sakshi
Sakshi News home page

గూండారాజ్‌.. రాజకీయ కక్షతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

Published Thu, Jul 18 2024 3:38 AM | Last Updated on Thu, Jul 18 2024 4:21 AM

YSRCP worker was brutally Assassinated by TDP political faction

రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య 

వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడిరోడ్డుపై విచక్షణా రహితంగా దాడి

నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు

వందల మంది జన సందోహం సమక్షంలో పాశవిక ఘటన 

వినుకొండలోనే ఎస్పీ, భారీగా పోలీసులు.. అయినా నిర్భయంగా హత్య

పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని ప్రకటించిన కొత్త ఎస్పీ

ఘోరం.. దారుణం.. అత్యంత దుర్మార్గం.. 

మాటలకందని మహా క్రౌర్యం.. నారావారి ఏలుబడిలో నరనరాన ఉన్మాదాన్ని నింపుకున్నట్లు పసుపుగూండాలు పేట్రేగిపోతున్నారు.. పల్నాడులో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. పసుపు గూండాల బరితెగింపునకు ఈ ఘటన పరాకాష్ట. రాష్ట్రంలో 40 రోజులుగా అమలవుతున్న ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసింది. హత్యలు, దాడులు, గృహదహనాలు, ప్రభుత్వ–ప్రైవేటు ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. పచ్చముఠాలకు సెల్యూట్‌ చేస్తూ పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుంది. టీడీపీ రౌడీలు ఆయుధాలు చేతబట్టి కాలకేయుల్లా దాడులకు తెగబడుతున్నారు. ఇదీ చంద్రబాబు రాక్షసపాలనలో ఏపీ ముఖచిత్రం... రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో నెలకొన్న అరాచక రాజ్యం.  

సాక్షి ప్రతినిధి, గుంటూరు: తొలి ఏకాదశి పర్వదినం.. ఎటు చూసినా కోలాహలం.. పల్నాడులో రామలింగేశ్వరుడి దర్శనం కోసం కిక్కిరిసిన భక్త జన సందోహం.. బందోబస్తు విధుల్లో వందల మంది పోలీసులు.. స్వయంగా ఎస్పీ పర్యవేక్షణ.. బుధవారం రాత్రి 7.30 గంటల సమయం.. రాజకీయ కక్షలతో ఒక్కసారిగా పచ్చ ముఠాల ఉన్మాదం పురి విప్పింది!  వినుకొండ నడిబొడ్డున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కొబ్బరిబొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపారు. వందలాది మంది చూస్తుండగానే నిత్యం రద్దీగా ఉండే ముండ్లమూరు బస్టాండ్‌ సెంటర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. మరోవైపు సత్తెనపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

కొబ్బరిబొండాల కత్తితో మాటు వేసి.. 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ (27) రాత్రి ఇంటికి వెళ్తుండగా పట్టణ తెలుగు యువత నాయకుడు ఎస్‌కె.జానీ తమ్ముడైన జిలానీ మరో ఇద్దరితో కలసి ముండ్లమూరు బస్టాండ్‌ సెంటర్‌లో మాటు వేశాడు. రషీద్‌ అక్కడికి చేరుకోగానే వెంట తెచ్చుకున్న కొబ్బరిబొండాల కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ హఠాత్‌ పరిణామంతో బాధితుడి చెయ్యి తెగిపోయి దూరంగా పడిపోయింది. అయినా ఆగకుండా నిందితుడు కిందపడిపోయిన రషీద్‌పై కూర్చుని విచక్షణా రహితంగా నరుకుతూనే ఉన్నాడు. 

తర్వాత తాపీగా అక్కడి నుంచి వెళ్లాడు. పోలీసులకు హత్యాయుధాన్ని అప్పగించి లొంగిపోయాడు. ఈ పాశవిక ఘటనతో వినుకొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న రషీద్‌ను పోలీసులు వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వైద్యశాల వద్దకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

సత్తెనపల్లిలో.. 
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల భాగ్యనగర్‌ కాలనీలో బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీకీ చెందిన ఓ మహిళ కుటుంబంపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఘటనలో గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఒక్కసారిగా మళ్లీ పల్నాడులో దాడులు మొదలు కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమా అయిపోలేదని, ఇంకా ఉందంటూ టీడీపీ నేతలు బరి తెగించి హెచ్చరికలు చేస్తుండటం గమనార్హం.

కొత్త ఎస్పీ రాగానే మళ్లీ మొదలు..
సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడులో దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లకు పాల్పడిన టీడీపీ నేతలు మరోసారి వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల రోజు దాడులు, విధ్వంసాలకు సంబంధించి అప్పటి ఎస్పీ బిందుమాధవ్‌తో పాటు పలువురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 

తాజాగా కంచి శ్రీనివాసరావు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే పల్నాడులో హింసాకాండ తిరిగి మొదలైంది. ఎస్పీ స్వయంగా వినుకొండలో ఉన్న సమయంలోనే తెలుగు యువత నాయకుడి తమ్ముడు నడిరోడ్డుపై హత్యకు తెగబడ్డాడు. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని కొత్తగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కంచి శ్రీనివాసరావు ఫక్తు రాజకీయ నేత మాదిరిగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.

ప్రభుత్వ హత్యలే: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి 
వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ హత్య, సత్తెనపల్లిలో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ కార్యకర్తల దాడులను చూస్తుంటే జిల్లా ఎస్పీని మార్చిన వెంటనే హింసకు తెగబడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ హింసాకాండను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఇవన్నీ సర్కారు హత్యలే. దీనికి ముఖ్యమంత్రి 
చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ బాధ్యత వహించాలి.

నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. వినుకొండలో వైఎస్సార్‌సీపీ నేత రషీద్‌ హత్యే ఇందుకు నిదర్శనం. రషీద్‌ హత్యోదంతాన్ని సోషల్‌ మీడియాలో చూడలేకపోయాం. టీడీపీ నేతలు కిరాతకంగా చంపేశారు. రోజుకో దారుణం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది. పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా కత్తులతో దాడి చేసి రోడ్లపై చంపేస్తుంటే ప్రజలు రోడ్లపై ఎలా తిరుగుతారు. చంద్రబాబు, లోకేశ్‌ ప్రోద్బలంతోనే ఈ హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం జరుగుతోంది. 
– అంజాద్‌ బాషా, మాజీ మంత్రి

టీడీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్ట
ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచి పల్నాడు జిల్లాలో టీడీపీ హత్యా రాజకీయాలనే నమ్ముకుంటోంది. పోలింగ్‌ రోజు, ఆ తరువాత ప్రతి నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను టార్గెట్‌ చేస్తు­న్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజ­కీయాలకు చోటుండకూడదు. వినుకొండ పట్టణ నడిబొడ్డున అతి కిరాతకంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తను హత్య చేయడం అమానుషం. టీడీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్ట.
– అంబటి రాంబాబు, మాజీ మంత్రి

చూస్తూ ఊరుకోం
వినుకొండలో ప్రజలంతా తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటుంటే.. టీడీపీ నేతలు మాత్రం వైఎస్సార్‌సీపీ కార్యకర్తను చంపి ప్రజలను భయాందోళనకు గురి చేశారు. టీడీపీ హత్యారాజకీయాలకు ఓ ముస్లిం యువకుడు బలైపోయాడు. దీనికి చంద్రబాబు, లోకేశ్, జీవీ ఆంజనేయులే కారణం. వారిపై కేసులు నమోదు చేయాలి. కొత్త ఎస్పీ రాగానే టీడీపీ రౌడీలు పేట్రేగిపోయారు. టీడీపీ హత్యా రాజకీయాలను చూస్తూ ఊరుకోం.
– బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే

శాంతి భద్రతలు లోపించాయి
ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో ఎటువంటి వివక్ష లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ది, సంక్షేమ పాలన అందించాం. టీడీపీ అ«ధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పల్నాడులో శాంతి భద్రతలు లోపించాయి. ఫలితాలొచ్చిన రోజే జిల్లాలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన వేలాది కుటుంబాలు జిల్లాను వదిలి వెళ్లిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ హత్యారా­జకీయాలతో మళ్లీ పల్నాడులో ఫ్యాక్షన్‌ పురుడుపోసుకొనేలా ఉంది. కొత్తగా వచ్చిన ఎస్పీ జిల్లాలో టీడీపీ రౌడీ మూకలను కట్టడి చేయాలి.
– కాసు మహేష్‌రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే

క్రూరంగా చంపేశారు
వైఎస్సార్‌సీపీ నాయకుడు రషీద్‌ను రెండు చేతులు నరికి క్రూరంగా చంపేశారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. లోకేశ్‌ రెడ్‌బుక్‌ ప్రకారం హత్యా రాజకీయాలు చేస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారు. రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్న ఒక్కొక్కరిని హత్య చేస్తూ వస్తున్నారు. తన అనుంగు పోలీసు అధికారులకు కీలకమైన పోస్టింగ్‌లు ఇచ్చి వారి ఆధ్వర్యంలో రెడ్‌ బుక్‌ను అమలు చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు.
– ఎమ్మెల్సీలు ఇసాక్‌ బాషా, మర్రి రాజశేఖర్‌

కిరాతకం రాజ్యమేలుతోంది
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కిరాతకం రాజ్యమేలుతోంది. వినుకొండలో వైఎస్సార్‌సీపీ నాయకుడు రషీద్‌ను టీడీపీ వ్యక్తులు ఎంత కిరా­తకంగా చంపారో యావత్‌ ప్రపంచం చూసింది. ఆటవికంగా రెండు చేతులు నరికి క్రూరంగా చంపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు రెడ్‌బుక్‌కి సెల్యూట్‌ చేస్తున్నారు. రషీద్‌ హత్యోదంతానికి కారకులు చంద్రబాబు, లోకేశ్‌లే. ఎన్నికల తర్వాత పల్నాడులో ప్రజలు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయి.
– ఖాదర్‌బాషా, అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం 

వ్యక్తిగత కక్షల వల్లే హత్య జరిగిందట!
దర్యాప్తు చేయకుండానే తేల్చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వెంటనే మీడియాకు వెల్లడి
గంటల వ్యవధిలోనే ఎందుకంత తొందర?
ఫక్తు టీడీపీ నాయకుడిలా వ్యవహరించిన వైనం

నరసరావుపేట: వ్యక్తిగత కక్షల వల్లే పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో రషీద్‌ అనే వ్యక్తిని జిలాని అనే వ్యక్తి నరికి చంపాడని జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు తేల్చేశారు. మృతుడు వైఎస్సార్‌సీపీ కార్యకర్త. చంపిన వ్యక్తి టీడీపీలో స్థానికంగా క్రియాశీలకం. అయినప్పటికీ వ్యక్తిగత కక్షల వల్లేనంటూ ఎస్పీ గంటల వ్యవధిలో స్పష్టం చేయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే ఎలాంటి దర్యాప్తు లేకుండానే నిర్ధిష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎక్కడైనా ఒక హత్య జరిగితే చాలా తతంగం ఉంటుంది. పలు ఆధారాలు, దర్యాప్తు అనంతరం హత్యకుగల కారణాన్ని వెల్లడిస్తుంటారు. 

అలాంటిది ఏమీ లేకుండానే ఎస్పీ హడావుడిగా బుధవారం అర్ధరాత్రి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సంఘటనలో పార్టీల ప్రమేయం లేదని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైనా, ప్రోత్సహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రజలు అందరూ సంయమనం పాటించాలని కోరారు. పట్టణంలో 144 సెక్షన్‌  అమలు చేస్తున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement