సాగుకు సాయం.. | - | Sakshi
Sakshi News home page

సాగుకు సాయం..

Published Thu, Dec 28 2023 2:18 AM | Last Updated on Thu, Dec 28 2023 2:18 AM

మిచాంగ్‌ తుపానుకు అల్లవరం మండలంలో మునిగిన వరి చేలు  - Sakshi

సాక్షి అమలాపురం: కాల గమనంలో మరో ఏడాది ఇట్టే కరిగిపోయింది. మరొ కొద్ది రోజులలోనే కొత్త సంవత్సరం రాబోతోంది. ప్రకృతి వైపరీత్యాలు.. వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా ధరల పతనం వారిని నిరుత్సాహానికి గురి చేసింది. అయితే రైతుకు దెబ్బ తగిలిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే నెల రోజుల వ్యవధిలో పరిహారం అందించడం, ధర పతనమైనప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరలు వచ్చే విధంగా ఆదుకోవడంలోనూ.. రైతులకు అందించే సంక్షేమ లబ్ధిని సకాలంలో అందిండంలోనూ.. పనిముట్లు, విద్యుత్‌ రాయితీలు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ ఏడాది రైతులకు సాగు దన్ను కల్పించింది. దీనితో గత పాలకుల రైతు వ్యతిరేక విధానాల వల్ల ‘వ్యయ సాయం’గా మారిన సాగు.. ప్రస్తుత పాలకులు అడుగడుగునా అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాలతో వారికి కొండంత అండగా నిలిచింది.

వర్షాభావం

● ఈ ఏడాది వాతావరణం అన్నదాతకు కలిసి రాలేదు. జూన్‌ నుంచి నవంబరు వరకు 45 శాతం లోటు వర్షం పడింది. గోదావరి పుణ్యమాని ఆయకట్టుకు నీటిలోటు లేకుండా పోయింది. వర్షాలు లేకపోవడానికి తోడు, వేసవిని తలపించే ఎండల వల్ల వరిలో కిరణజన్య సంయోగ క్రియ బాగా జరగడం వల్ల వరిలో దిగుబడిలో బాగా పెరిగాయి. ఇది జిల్లా రైతులకు కలసివచ్చింది. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించారు. ఖరీఫ్‌లో జిల్లాలో 35 బస్తాలు (బస్తా 75 కేజీల) నుంచి 48 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. డిసెంబరులో మిచాంగ్‌ తుపాను వల్ల కురిసిన వర్షాలకు సుమారు 26 వేల ఎకరాల్లో వరిచేలు నేలనంటి, నీట మునిగాయి. దీని వల్ల రైతులు కొంత వరకు దిగుబడి కోల్పోయారు. ప్రభుత్వం నిబంధనలు పక్కనబెట్టి తేమ ఉన్న ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడంతో రైతులు కోలుకున్నారు.

● గత ఏడాది రబీకి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలో కోతలు జరిగాయి. చివరిలో నీటి ఎద్దడి ఏర్పడినా జిల్లా యంత్రాంగం ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించి ప్రతి ఎకరాకు నీరందించింది. ఈ ఏడాది సైతం రబీకి సరిపడే నీరు లేకున్నా క్రాస్‌బండ్‌లు, మోటార్‌ పంపింగ్‌కు ప్రభుత్వం రూ.ఐదు కోట్లు విడుదల చేసేందుకు హామీ ఇచ్చింది.

రైతుకు వెన్నుదన్నుగా

● జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో 1,56,874 మంది రైతులు, 4,859 మంది కౌలుదారులకు కలిపి ఎకరాకు రూ.13,500 చొప్పున రైతు భరోసా, పీఎం కిసాన్‌ నిధులు మంజూరు చేశారు. వీరి ఖాతాలలో సుమారు రూ.288.33 కోట్లు జమ చేశారు. రైతులకు, కౌలుదారులకు కలిపి ఈ ఏడాది వివిధ బ్యాంకుల ద్వారా, వివిధ రకాలుగా రూ.8,511.07 కోట్లు రుణాలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

● జిల్లాలో ఈ ఏడాది 22 మండలాల పరిధిలోని 315 గ్రామాలలో 62,798 మంది రైతులకు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చారు. ఈ ఏడాది సీసీఆర్‌సీ, జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ రైతులకు రూ.155 కోట్ల రుణ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇంత వరకు 70 శాతం మందికి రుణం మంజూరు చేశారు.

ఉద్యాన రైతులకు సైతం అండగా

● కొబ్బరి ధరలు పతనం కావడంతో రైతుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోలు చేయించింది. ఈ కేంద్రాలు ఏర్పాటు చేయగానే బహిరంగ మార్కెట్‌లో వెయ్యి కొబ్బరికాయల ధర రూ.7 వేల నుంచి రూ.9,500 వరకు పెరిగింది. అలాగే ఎండు కొబ్బరి ధర క్వింటాల్‌ రూ.8,500 నుంచి రూ.10,500 వరకు పెరిగింది.

కౌలుదారులు అగ్రికల్చర్‌ ప్రొఫెషనల్స్‌

కౌలుదారులను అగ్రికల్చర్‌ ప్రొఫెషనల్స్‌గా గుర్తించింది. వీరికి వ్యక్తిగత రుణాలు మంజూరు చేసింది. జిల్లాలో పది మండలాల్లో పది గ్రామాలను ఎంపిక చేసి వారిలో 323 మందికి రూ.1,45,58,100 రుణాలుగా అందించి ప్రభుత్వం కౌలుదారులకు అండగా ఉంటోందని చేతల్లో చూపించారు.

కొత్త జిల్లా ఏర్పడిన తరువాత ప్రభుత్వ పరంగా రైతులకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న సాయం వేగంగా అందుతున్నాయి.

జిల్లాలో ముమ్మిడివరంలో వ్యవసాయశాఖ డాట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (ఏఆర్‌ఎస్‌) ఏర్పాటుకు ఈ ఏడాది బీజం పడింది. ఇది ఏర్పాటు చేసేందుకు జిల్లాలో భూమిని పరిశీలిస్తున్నారు.

గోదావరికి జూలై నెలలో వచ్చిన వరద వల్ల నష్టపోయిన రైతులకు నెల రోజుల వ్యవధిలోనే పరిహారం అందింది. ముమ్మిడివరం, అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల్లో సుమారు 3,869 ఎకరాల్లో పంట దెబ్బతినగా, వారికి పరిహారంగా రూ.2,95,98,002 పెట్టుబడి రాయితీగా అందజేశారు. దీని వల్ల 5,077 మంది రైతులకు పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పెట్టుబడి రాయితీ అందింది.

అన్నదాతకు అడుగడుగునా దన్ను

రైతు భరోసా సొమ్ముల విడుదల

వరద నష్టం పరిశీలనకు సీఎం రాక

నెల రోజుల్లోనే పరిహారం విడుదల

నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోలు

ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక చర్యలు

వర్షాభావంలోనూ అధిక దిగుబడులు

నీరు తక్కువగా ఉన్నా రబీకి అనుమతి

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement