విద్యార్థి భవితకు ఇదే ప్రాతిపదిక
రాయవరం: ఉన్నత చదువులకు, ఉద్యోగ దరఖాస్తులకు పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన సర్టిఫికెట్‌నే ప్రాతిపదికగా తీసుకుంటారు. విద్యార్థి బంగారు భవిష్యత్తుకు బాట వేసేది పదవ తరగతి. అందుకే టెన్త్ సర్టిఫికెట్లలో పొరపాట్లు లేకుండా నామినల్ రోల్స్‌ను రూపొందించాల్సిన అవసరం ఉంది. మరో మూడు నెలల్లో విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయనుండగా..ప్రస్తుతం నామినల్ రోల్స్ తయారు చేసే పనిలో ప్రధానోపాధ్యాయులున్నారు.
డిజిటలైజేషన్ నామినల్ రోల్స్
పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లో ఇప్పటికే సమర్పించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేర్లు, కులం, ఆదాయం, నివాస ప్రాంతం, ఆధార్‌కార్డు నంబరు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు, పరీక్ష ఫీజును కూడా చెల్లించారు. విద్యార్థుల వివరాల నమోదులో ఏ చిన్న పొరపాటు జరిగినా అది వారి భావి జీవితానికి గ్రహపాటుగా నిలుస్తుంది. అందుకే నామినల్ రోల్స్ విషయంలో ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా వ్యవహరించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసిన విద్యార్థుల నామినల్ రోల్ వివరాలను మాన్యువల్ కాపీలో కూడా జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సమర్పించేవారు. గత విద్యా సంవత్సరం నుంచి మాన్యువల్ కాపీలు సమర్పించనవసరం లేదంటూ ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 388 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 240 పాఠశాలలుండగా, ప్రైవేట్ యాజమాన్య పరిధిలో 148 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల నుంచి 19,454 మంది పదవ పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించారు. 9,726 మంది బాలురు, 9,728 మంది బాలికలున్నారు.
ఎడిట్‌కు అవకాశం
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలను ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్ చేశారు. ఆన్‌లైన్‌లో పది నామినల్ రోల్స్ సమర్పణలో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఈ నెల 23వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది.
ఆ 362 మంది విద్యార్థులు ఎక్కడ?
పరీక్ష ఫీజు అపరాధ రుసుం రూ.500తో ఫీజు కట్టడానికి గడువు ఈ నెల 16తో ముగిసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నమోదైన విద్యార్థుల్లో 362 మంది ఫీజు చెల్లించలేదు. వారిలో 240 మంది బాలురు, 122 మంది బాలికలున్నారు. వీరు పరీక్ష ఫీజు ఎందుకు చెల్లించలేదంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆరా తీస్తున్నారు. ఫీజు కట్టని వారిలో జిల్లా పరిషత్ విద్యార్థులే అధికంగా ఉన్నారు.
తప్పులకు అవకాశం లేకుండా..
ఆన్‌లైన్‌లో నామినల్ రోల్స్ సబ్మిట్ చేసే సమయంలో ప్రధానోపాధ్యాయులు తప్పులకు అవకాశం లేని విధంగా చూడాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ఒకటికి రెండుసార్లు వివరాలు సరిచూసుకుని సబ్మిట్ చేస్తే ఇబ్బంది ఉండదు. పేరెంట్స్ నుంచి కూడా డిక్లరేషన్ తీసుకోవాలని హెచ్‌ఎంలకు సూచించాం.
– డాక్టర్ షేక్ సలీం భాషా, డీఈవో, అమలాపురం
టెన్త్ నామినల్ రోల్స్ సవరణకు
23 వరకు అవకాశం
పొరపాట్లకు తావివ్వొద్దన్న
పరీక్షల విభాగం
Comments
Please login to add a commentAdd a comment