పెండింగ్ ఫీజు రీ యింబర్స్ చేయాలి
అమలాపురం టౌన్: డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) జిల్లా ప్రతినిధులు ఆర్డీవో కె.మాధవికి శుక్రవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సతీష్, సందీప్ తదితరులు ఆర్డీవోకు విద్యార్థులు పడుతున్న అవస్థలను వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వసతి దీవెన పెండింగ్ నిధులు కూడా విడుదల చేయాలని కోరారు. గతంలో ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నాలుగు క్వార్టర్ల రూపంలో డబ్బు జమ అయ్యేదని ఆ వినతిపత్రంలో గుర్తు చేశారు. గత సంవత్సరం విద్యార్థులకు కేవలం ఒక్క క్వార్టర్ మాత్రమే విడుదల చేసి మిగిలిన మూడు క్వార్టర్లకు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదువుతున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మూడు క్వార్టర్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా రూ.2,100 కోట్లు విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులకు గురువుతున్నారన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు వచ్చే నెల నుంచి మొదలవుతున్నాయని గుర్తు చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజులు చెల్లిస్తేనే వారికి పరీక్షలు రాసేందుకు అనుమతులు ఇస్తామని ఆయా కళాశాలల యాజమాన్యాలు అంటున్న క్రమంలో విద్యార్థులు ఆందోళనలో పడ్డారని ఏఐఎస్‌ఎఫ్ ప్రతినిధులు ఆర్డీవోకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment