● రబీ నారుమడులను ముంచేసిన వర్షాలు
● చల్లదనానికి మొలకెత్తని విత్తనాలు
ఉప్పలగుప్తం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడన ద్రోణి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఖరీఫ్ కోత కోసిన పనులు.. ధాన్యం తడిసిపోవడంతోపాటు రబీ నారుమడులు దెబ్బతిన్నాయి. జిల్లాలో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. అంబాజీపేట, అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన వంటి మండలాల్లో వర్షం పడింది. ముంపునకు భయపడి సముద్ర తీర ప్రాంతాల్లో ఖరీఫ్ సాగు చేయని రైతులు రబీపై ఆశలతో నారుమడులు వేశారు. ఈ మడులు గత రెండు రోజుల వర్షాలకు మునిగిపోయాయి. దీంతో రైతులు నారుమడిలో ముంపు నీరు దిగువకు వదిలేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. నీరు దిగే అవకాశం లేక బకెట్లు.. మగ్గులతో నీరు బయటకు తోడుతున్నారు. వెంటవెంటనే మరోసారి వర్షం కురుస్తుండడంతో నీరు తోడడానికి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ ఎలాగూ పండలేదు. కనీసం రబీ అయినా పండితే సొమ్ము కళ్ల జూడవచ్చని ఆశించిన రైతులకు మొదట్లోనే వర్షాల రూపంలో తగులుతున్న దెబ్బ ఇబ్బందులు పాల్జేస్తోంది. వాతావరణంలో ఏర్పడిన తేమ, మంచు ప్రభావాలతో చల్లని గాలులకు విత్తనం పూర్తి స్థాయిలో మొలకెత్తడంలేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment