పరిష్కారం పరిహాసమే..!
● రెవెన్యూ సదస్సులలో
ఇబ్బడిముబ్బడిగా అర్జీలు
● స్వీకరణకే అధికారులు పరిమితం
● ఉన్నతాధికారుల చేతుల్లోనే పరిష్కారం
● చేతులెత్తేస్తున్న రెవెన్యూ అధికారులు
● ఈ మాత్రానికి సదస్సులు
దేనికని ప్రజల నిట్టూర్పు
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజల వద్దకే ప్రభుత్వం.. అక్కడే సమస్యల పరిష్కారం నినాదంతో కూటమి సర్కారు ఆర్భాటంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ప్రహసనంగా మారుతున్నాయి. వివిధ సమస్యలపై ప్రజలు ఇస్తున్న అర్జీలకు అతీగతీ లేకుండా పోతోంది. సదస్సుకు హాజరై వినతులు సమర్పిస్తే తమ బాధలు తీరుతాయన్న తలంపుతో జిల్లావ్యాప్తంగా ప్రజలు ఇబ్బడిముబ్బడిగా అర్జీలు ఇస్తున్నారు. సదస్సులలో అవి వెంటనే పరిష్కారమవుతాయని ఆశ పడుతున్నారు. కానీ, వారి ఆశలు అడియాసలుగానే మారుతున్నాయి. అర్జీ స్వీకరిస్తున్న అధికారులు వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారు? ఎవరు పరిష్కరిస్తారు? ఎన్ని రోజుల్లో కష్టాలు తీరుతాయనే అంశాలపై స్పష్టత ఇవ్వడం లేదు. రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తూండటంతో వాటికి జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ పరిష్కారం చూపాలని క్షేత్ర స్థాయి అధికారులు చెబుతూండటంతో మరింత గందరగోళం నెలకొంది. సమస్యకు పరిష్కారం లభించకుంటే ఈ సదస్సులకు ఎందుకు రావాలని మండల స్థాయి అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వినతుల వెల్లువ
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటికి ఆయా మండల స్థాయి అధికారులు హాజరవుతున్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఈ సదస్సులలో వినతులు వెల్లువెత్తుతున్నాయి. వస్తున్న అర్జీల్లో భూ, రెవెన్యూ సమస్యలదే సింహభాగం. భూ వివాదాలు పరిష్కరించాలని, తమకు భూమి కేటాయించాలని, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అధిక శాతం ప్రజలు కోరుతున్నారు. ఆన్‌లైన్‌లో పేర్ల మార్పు, తండ్రి పేరు లేకపోవడం, భూమి స్వభావం అన్ నోన్ అని పెట్టడం, కంబైన్డ్ పట్టాలు విడదీయాలని పలువురు అర్జీలు సమర్పిస్తున్నారు. ఇలా ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధిత శాఖ అనుమతించడం లేదు. మరోవైపు ఈ సమస్యలకు పరిష్కారం చూపడం తహసీల్దార్ పరిధిలో కూడా లేదు. ఇటువంటి సమస్యలు జేసీ పరిధిలోనే పరిష్కారమవుతాయని, ఆయనకు ఫైలు పెట్టి పరిష్కరించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వెబ్ ల్యాండ్ 1బి అడంగల్‌లో సరిదిద్దుకునే అవకాశం తహసీల్దార్ కార్యాలయంలో లేదు.
ఇటువంటి ప్రతి అంశాన్ని జేసీ దృష్టిలో పెట్టాలని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. గ్రామంలోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఉన్నతాధికారులు చూడాలంటున్నారని ఆవేదన చెందుతున్నారు. జాయింట్ కలెక్టర్ చేతిలో అధికారాలు ఉండటంతో తహసీల్దార్ కార్యాలయాలకు ప్రాధాన్యం తగ్గిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయిన భూములు సైతం ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో ప్రజలు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అటువంటి సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు చూపలేక రెవెన్యూ అధికారులు సతమతమవుతున్నారు. ఈమాత్రం దానికి సదస్సులు పెట్టడం దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పెదవి విరుపు
రెవెన్యూ సదస్సులు ఎప్పుడు పెడతారా.. తమ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయా అని మొదట్లో ఆశగా ఎదురు చూసిన రైతులు ఇప్పుడు పరిస్థితి చూసి నిరాశ చెందుతున్నారు. అర్జీలు సమర్పించినా సమస్యల పరిష్కారంలో ఎటువంటి పురోగతీ లేకపోవడంతో పెదవి విరుస్తున్నారు. భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, తప్పుల తడకగా నమోదైన అంశాలను సరిచేయడం వంటివి పరిగణనలోకి తీసుకోకుండా సదస్సులు నిర్వహించడంపై నిరుత్సాహం చెందుతున్నారు.
నిర్ణీత వ్యవధిలో పరిష్కారం
రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన అర్జీలకు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారం చూపిస్తున్నాం. ప్రతి అధికారీ జవాబుదారీతనం కలిగి ఉండేలా అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం. దీని కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు పర్యవేక్షణ అధికారి బాధ్యతలు అప్పగించాం.
– పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్
రెండు అర్జీలిచ్చాను
సమిశ్రగూడెంలో హిందువుల శ్మశాన వాటిక సర్వే చేయాలని. గ్రామంలోని ప్రభుత్వ చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు రీ సర్వే చేపట్టాలని రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇచ్చాను. వినతులు తీసుకున్నారే తప్ప, ఎప్పుడు పరిష్కారం చూపుతారో చెప్పలేదు. అర్జీ ఆన్‌లైన్ అయినట్లు ఎలాంటి రసీదూ ఇవ్వలేదు.
– కొత్తపల్లి సత్యనారాయణ, సమిశ్రగూడెం,
నిడదవోలు రూరల్ మండలం
జిల్లాలో రెవెన్యూ సదస్సుల వివరాలు
ఇప్పటి వరకూ సదస్సులు జరిగిన
గ్రామ పంచాయతీలు 70
కొవ్వూరు డివిజన్‌లో వచ్చిన అర్జీలు 348
రాజమహేంద్రవరం డివిజన్‌లో అర్జీలు 394
మొత్తం అర్జీలు 742
పరిష్కరించినవి 95
Comments
Please login to add a commentAdd a comment