కోటసత్తెమ్మ తల్లికి సారె సమర్పణ
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ తల్లి తిరునాళ్లు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. నిడదవోలు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం సభ్యులు అమ్మవారికి చీర, సారె, వివిధ రకాల స్వీట్లు, పండ్లు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ పర్యవేక్షణలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, కుంకుమ పూజలు, హోమాలు, చండీ పారాయణ నిర్వహించారు.
21న కొవ్వూరులో
మెగా జాబ్‌మేళా
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)/కొవ్వూరు: వికాస ఆధ్వర్యాన మండల, నియోజకవర్గ స్థాయిల్లో మెగా, మినీ ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ఈ నెల 21న కొవ్వూరులో నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను కలెక్టరేట్‌లో మంగళవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొవ్వూరులో సుమారు 28 బహుళజాతి సంస్థల ఆధ్వర్యాన ఆ రోజు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో సుమారు 1,500 ఉద్యోగాల భర్తీకి ఈ మేళా జరుగుతోందని వివరించారు. జిల్లావ్యాప్తంగా ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఆ రోజు ఉదయం 9 గంటలకు కొవ్వూరు ఏబీఎన్ – పీఆర్‌ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్‌కు సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరు కావాలని సూచించారు. యువత నైపుణ్యాభివృద్ధికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని, దీనికోసం న్యాక్, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌లను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ టీచర్ల పదోన్నతుల
జాబితా విడుదల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల జాబితా విడుదలైంది. కాకినాడ జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ మంగళవారం ఈ విషయం తెలిపారు. పదోన్నతుల వివరాలు జిల్లా విద్యా శాఖ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, ఏమైనా అభ్యంతరాలుంటే బుధవారం ఉదయం 11 గంటల్లోగా తెలియజేయాలని సూచించారు.
రిపబ్లిక్ డే పరేడ్‌కు
‘నన్నయ’ విద్యార్థి ఎంపిక
రాజానగరం: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే నెల 26న జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌కు ఆదికవి నన్నయ యూనివర్సిటీ విద్యార్థి ఎస్.వెంకట రమణ ఎంపికయ్యాడు. అతడు యూనివర్సిటీ క్యాంపస్‌లోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఎంపీఈడీ ఫైనలియర్ చదువుతున్నాడు. పుణేలో జరిగిన ప్రీఆర్‌డీలో అత్యుత్తమ ప్రతిభ చూపడం ద్వారా ఢిల్లీ పరేడ్‌కు ఎంపికయ్యాడని ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్‌కు మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా వారిలో వెంకట రమణ కూడా ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థిని వీసీ ఆచార్య శ్రీనివాసరావు మంగళవారం అభినందించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ప్రిన్సిపాల్ కె.సుబ్బారావు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ పి.వెంకటేశ్వరరావు, పీఓ ఎం.గోపాలకృష్ణ పాల్గొన్నారు.
విద్యుత్ పొదుపుపై పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు విద్యుత్ పొదుపు ప్రాధాన్యంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ కె.తిలక్ కుమార్ ఈ విషయం ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 20న విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment