![ఎస్టీలకు అండగా ఉంటాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/18/17rjc361-270096_mr-1734477376-0.jpg.webp?itok=lwLKd9PK)
ఎస్టీలకు అండగా ఉంటాం
● వారి సమస్యల పరిష్కారమే లక్ష్యం
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు
శంకర్ నాయక్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో ఎస్టీలకు అండగా నిలిచి, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యుడు వదిత్యా శంకర్ నాయక్ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రజల నుంచి స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎస్టీలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చాగల్లు మండలం మీనానగరం, తాళ్లపూడి మండలం తుపాకులగూడెం తదితర ప్రాంతాల్లో అధికారులు వ్యక్తిగతంగా పర్యటించి, ఆయా కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, జనాభా, ప్రభుత్వ పరంగా పొందుతున్న పథకాల వివరాలు సేకరించాలని కోరారు. ఆధార్ లేక కొన్ని ఎస్టీ కుటుంబాల్లో బడికి వెళ్లే పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెప్పారు. చెంచు తెగకు చెందిన 16 కుటుంబాలు చాగల్లు మండలం మీనానగరంలో తరతరాలుగా నివసిస్తున్నామని, చెరువులపై తమకు అవకాశం ఇవ్వాలని ఆ గ్రామానికి చెందిన చెందిన ఆవాల కోటయ్య కోరారు. దీనిపై సర్వే చేసి, అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని శంకర్ నాయక్ చెప్పారు. తాళ్లపూడి మండలం తుపాకులగూడెంలో సాగు చేసుకుంటున్న భూములపై, గ్రామంలోని చెరువుల్లో చేపలు పెంచేందుకు హక్కులు కల్పించాలని, ఆధార్ కార్డు లేక, కొన్ని కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు దక్కడం లేదని మరో అర్జీ వచ్చింది. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కేఎన్ జ్యోతి, జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment