విభిన్న ప్రతిభావంతుల లక్ష్య సాధనకు ప్రోత్సాహం
● కలెక్టర్ ప్రశాంతి పిలుపు
● ఘనంగా అంతర్జాతీయ
దివ్యాంగ దినోత్సవం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): విభిన్న ప్రతిభావంతులకు సహాయం చేయడం కన్నా, వారిలో ప్రతిభను గుర్తించి, లక్ష్య సాధన దిశగా ప్రతి ప్రోత్సహించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. స్థానిక ఐఎల్‌టీడీ జంక్షన్‌లోని గేదెల నూకరాజు కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన దివ్యాంగులకు అన్ని విధాలా అండగా నిలిచి, ప్రభుత్వ పరంగా చేయూతనిస్తామని చెప్పారు. పూర్తిగా మంచానికే పరిమితమైన దివ్యాంగుల్లో అర్హులకు రూ.15 వేలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికోసం వారి కుటుంబ సభ్యులు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీ అందజేయవచ్చని చెప్పారు. మెకనైజ్డ్, బ్యాటరీ ట్రై సైకిళ్లు, దివ్యాంగుల చైర్స్ కోసం ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నాయని, ఆయా ఉపకరణాలు అందించేందుకు స్వచ్ఛం సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్, సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఇన్‌చార్జి సహాయ సంచాలకుడు వీవీవీఎస్ లక్ష్మణరావు తదితరులు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా కన్నా ఆశ్రయ ఫౌండేషన్, పలుకు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. విభిన్న ప్రతిభావంతులకు సేవలందిస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment