రత్నగిరి.. సమస్యలే మరి!
చక్కదిద్దుతా..
భక్తులకు ఉత్తమ సేవలందించేందుకు తగు చర్యలు తీసుకుంటాను. ప్రతి రోజూ అన్ని విభాగాలనూ తనిఖీ చేసి, వాటిపై అవగాహన తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే ఆయా విభాగాల అధికారులతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంటాను. అన్నీ చక్కదిద్దగలననే విశ్వాసం ఉంది.
– వీర్ల సుబ్బారావు,
నూతన ఈఓ, అన్నవరం దేవస్థానం
● అస్తవ్యస్తంగా అన్నవరం
దేవస్థానం ఆర్థిక పరిస్థితి
● ప్రదక్షిణ దర్శనం నిలిపివేత
● నిరుపయోగంగా నివేదన శాల
● విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి
దాత ముందుకు వచ్చినా మోకాలడ్డు
● కొత్త ఈఓ దృష్టి
సారించాలంటున్న భక్తులు
అన్నవరం: నూతన కార్యనిర్వహణాధికారి (ఈఓ) వీర్ల సుబ్బారావుకు అన్నవరం దేవస్థానంలో అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అప్పటి నుంచీ దేవస్థానంలోని వివిధ విభాగాలను పరిశీలించి, సిబ్బంది పని తీరుపై వాకబు చేస్తున్నారు. మూడు రోజులుగా ఆయన ఉదయం 5 గంటలకే వ్రత విభాగం, ఆలయం, గోకులం, ఇతర విభాగాలను పరిశీలించి, సిబ్బందికి తగు ఆదేశాలిచ్చారు. కొత్త ఈఓ దృష్టి పెట్టాల్సిన పనులు దేవస్థానంలో చాలానే కనిపిస్తున్నాయి.
ఆర్థిక ఇబ్బందులు
దేవస్థానం ఆర్థిక పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రతి నెలా జీతభత్యాల చెల్లింపునకు రూ.6 కోట్లు అవసరం. పెన్షన్లు, ఇతర చెల్లింపులకు మరో రూ.2 కోట్లు కావాలి. ఇంకా దినుసుల కొనుగోళ్లు, విద్యుత్ చార్జీల చెల్లింపునకు మరో రూ.3 కోట్లు అవసరం. కానీ ప్రస్తుతం దేవస్థానం వద్ద నగదు నిల్వలు రూ.2 కోట్లు కూడా లేని పరిస్థితి. కార్తిక మాసంలో రూ.21 కోట్ల ఆదాయం వచ్చినా వెంటనే వివిధ బిల్లులు చెల్లించేశారు. దీనికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఇంజినీరింగ్ విభాగానికి రూ.10 కోట్లు కేటాయించగా నవంబర్ నెలాఖరుకే సుమారు రూ.9.25 కోట్లు చెల్లించేశారు. ఇంకా రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీని కోసం సప్లిమెంటరీ బడ్జెట్ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రదక్షిణ దర్శనానికి స్వస్తి
గతంలో దాతల సహకారంతో చేపట్టిన పలు కార్యక్రమాలకు క్రమంగా స్వస్తి చెప్పారు. అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ 2023లో సత్యదేవుని ప్రధానాలయంలో నాలుగు మూలలా శ్రీగంధం, (గంధం గిన్నె). లక్ష్మీ హుండీ, కామధేనువు, కల్పవృక్షం ఏర్పాటు చేసి, భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే విధానం ప్రవేశపెట్టారు. ఈ నాలుగింటినీ సప్తగిరి హేచరీస్ అధినేత పెదబాబు రూ.30 లక్షలతో తయారు చేయించి, దేవస్థానానికి అందజేశారు. 2023 దసరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రదక్షిణ దర్శనానికి రూ.300 టికెట్టు పెట్టారు. శ్రీగంధం గిన్నె, లక్ష్మీ హుండీ, కామధేనువు, కల్పవృక్షానికి నమస్కరిస్తూ సత్యదేవునికి ప్రదక్షిణ చేయడంతో భక్తులు సంతృప్తి చెందేవారు. ఈ ప్రదక్షిణ దర్శనం టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి ప్రతి రోజూ రూ.2 లక్షలు పైగా ఆదాయం వచ్చేది. ఆజాద్ తరువాత ఈఓగా వచ్చిన కె.రామచంద్ర మోహన్ ఈ ప్రదక్షిణ దర్శనాన్ని నిలిపివేశారు. ఆ నాలుగు వస్తువులను ఆలయంలో ఒక మూలకు చేర్చారు. దీంతో దాత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
నిరుపయోగంగా కొత్త నివేదన శాల
అదే విధంగా తుని పట్టణానికి చెందిన దాత చెక్కా తాతబాబు రూ.20 లక్షల విరాళంతో రామాలయానికి ఎదురుగా ఉన్న సర్క్యులర్ మండపంపై 2023లో స్వామివారి నివేదన శాల నిర్మించారు. దానిలో కొద్ది రోజులు మాత్రమే నివేదన తయారు చేశారు. తరువాత క్యూ కాంపెక్స్ వద్ద ఉన్న పాత నివేదన శాలకు మళ్లీ మార్చారు. ప్రస్తుతం కొత్త నివేదన శాల నిరుపయోగంగా ఉంది. దీనిపై దానిని నిర్మించిన దాత అసంతృప్తి వ్యక్తం చేశారు.
జ్యోతిర్మయి వ్రతానికి మంగళం
ఆజాద్ ఈఓగా ఉన్నప్పుడు 2023లో జ్యోతిర్మయి వ్రతం నిర్వహణకు రామాలయం సమీపాన ఉన్న పాత భవనానికి రూ.30 లక్షలతో మరమ్మతులు చేశారు. ఏసీలు అమర్చారు. వ్రతం ప్రారంభానికి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి కూడా ఇచ్చారు. కానీ, దానిని ఆ తరువాత ఈఓగా వచ్చిన రామచంద్ర మోహన్ నిలిపివేశారు. ప్రదక్షిణ దర్శనం, కొత్త నివేదన శాల వినియోగం, జ్యోతిర్మయి వ్రతం నిర్వహణకు సంబంధించి దేవస్థానం వైదిక కమిటీ ఒక ఈఓ హయంలో అవునని, మరో ఈఓ హయాంలో కాదని చెప్పడం కూడా వివాదాస్పదమవుతోంది.
దాతను కాదని.. సొంత సొమ్ముతో..
పశ్చిమ రాజగోపురం వద్ద రూ.2 కోట్ల వ్యయంతో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి 2023లో విశాఖపట్నానికి చెందిన లారెల్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ముందుకు వచ్చింది. ఆ మేరకు నాటి ఈఓ ఆజాద్ ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆ తరువాత ఏమైందో ఆ విశ్రాంతి షెడ్డు నిర్మాణం ఆగిపోయింది. ప్రస్తుతం దేవస్థానం నిధులు రూ.90 లక్షలతో నూతన విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోసారి ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడితే ఈ షెడ్డును వారే నిర్మించే అవకాశం ఉంటుంది.
గైడ్ల దందా
దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం వద్ద గైడ్‌లుగా చెప్పుకుంటున్న అనధికార వ్యక్తులు భక్తులకు సులభంగా దర్శనం చేయిస్తామంటూ దందా చేస్తున్నారు. వీరికి దేవస్థానంలోని కొంతమంది ఉద్యోగులు, హోం గార్డులు, సెక్యూరిటీ సిబ్బంది సహకరిస్తున్నారనే విమర్శ ఉంది. వీరు భక్తులను ప్రత్యేక దర్శనం టికెట్లు కొనకుండా, ఆ డబ్బులు తమకిస్తే తామే దర్శనం చేయిస్తామని చెప్పి, దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఆహార పదార్థాల తనిఖీ అవసరం
సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజనం, ఇతర ఆహార పదార్థాలు రుచిగా ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెండర్ ద్వారా కొనుగోలు చేస్తున్న బియ్యంలో కల్తీయో లేక స్టీమ్ మీద తయారవడం వల్లనో కానీ ఆ అన్నం చల్లారితేనే కానీ తినడానికి బాగుండటం లేదని పలువురు భక్తులు అంటున్నారు. అలాగే, కూరలు, సాంబారు కూడా. ప్రతి రోజూ వీటిని తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆలయం వద్ద భక్తులకు పంపిణీ చేస్తున్న పులిహోరపై కూడా అప్పుడప్పుడు ఇదే విధమైన విమర్శలు వస్తున్నాయి. వీటిపై కూడా దృష్టి పెట్టాలి. సత్రాల్లో వసతులపై కూడా తనిఖీలు చేసి, ఎప్పటికప్పుడు భక్తుల అభిప్రాయాలు తెలుసుకుని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
అన్నవరం దేవస్థానం
Comments
Please login to add a commentAdd a comment