25 డీసీలకు మూడు మాత్రమే ఆ పార్టీకి..
సాక్షి, అమలాపురం: సాగునీటి సంఘాల ఎన్నికలలో కీలకమైన డిస్ట్రిబ్యూటరీ ఎన్నికలలో జనసేన పార్టీకి మిత్రపక్షమైన టీడీపీ జెల్ల కొట్టింది. మొత్తం 25 డీసీలకు మంగళవారం ఎన్నికలు జరగగా మిత్రపక్షమైన జనసేనకు కేవలం మూడు డీసీలలో మాత్రమే అవకాశం కల్పించింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కూడా ఆ పార్టీకి కేవలం ఒక డీసీ మాత్రమే వచ్చింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని గోదావరి డెల్టాలో డీసీలకు ఎన్నికలు సజావుగా సాగాయి. అధికార టీడీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించినవారికే డీసీలుగా పదవులు దక్కాయి. వారు ఎంపిక చేసిన వారిని వాటర్ యూజర్ అసోసియేషన్ల (డబ్ల్యూయూఏ) ప్రతినిధులు ఎన్నుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో పీబీసీ ఒకటి నుంచి మరాలశెట్టి సునీల్‌కుమార్, రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో కాజులూరు డీసీ నుంచి లకాని కృష్ణ చైతన్య, రాజోలు నియోజకవర్గం నుంచి వినిశెట్టి బుజ్జి ఎంపికయ్యారు.
పిఠాపురం పరిధిలో వీబీసీ రెండు డీసీ నుంచి అనిశెట్టి సత్యానందరెడ్డి టీడీపీ నుంచి ఎంపికయ్యారు. ఇక జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కరప డీసీకి పుణ్యమంతుల గంగా సత్యనారాయణ, కాకినాడ డీసీ నుంచి కొప్పిరెడ్డి వీరాస్వామి (టీడీపీ) ఎన్నిక కావడం గమనార్హం. పి.గన్నవరం డీసీగా గుబ్బల శ్రీనివాస్, అయినవిల్లి డీసీగా కాకర శ్రీరా ములు ఎన్నిక కావడం జనసేన పార్టీకి మింగుడపడని అంశంగా మారింది.
కోనసీమ జిల్లాలో తూర్పు డెల్టా పరిధిలో ఆలమూరుకు మెర్ల గోపాలస్వామినాయుడు, కోటిపల్లికి దాట్ల విజయగోపాల్ రాజు, కూళ్ల మేకా శివప్రసాద్, రామ చంద్రపురం నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, ఎరప్రోతవరం నిడదవోలు వెంకట సుబ్రహ్మణ్యచౌదరి, మండపేట వడాల వెంకట సుబ్బారెడ్డి ఎంపికయ్యారు. మధ్య డెల్టా పరిధిలో అల్లవరం దాట్ల వెంకట రాజగోపాలరాజు, అవిడి చపల జగన్నాథం, గోపాలపురం కరుటూరి నర్శింహరావు, కాట్రేనికోన ఆకాశం శ్రీనివాస్, అమలాపురం రాజులవూడి భీముడు, అయినవిల్లి కాకర శ్రీను, మురమళ్ల చివులూరి సుబ్బరాజు, ఉప్పలగుప్తం దంగేటి వెంటక రెడ్డి నాయుడు ఎన్నిక కాగా, కాకినాడ జిల్లా తూర్పు డెల్టా పరిధిలో కాజులూరు లకాని కృష్ణ చైతన్య, సిరిపురం పేపకాయల నారాయణరావు, తాళ్లరేవు వేగేశ్న భాస్కరరాజు ఎన్నిక కాగా, తూర్పు గోదావరి జిల్లాలో తూర్పు డెల్టా పరిధిలో అనవర్తి తమలంపూడి సుధాకర్ రెడ్డి, కొమరిపాలెం కొవ్వూరి వేణుగోపాలరెడ్డి ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment