జ్యూయలరీ షాపులో చోరీకి విఫలయత్నం
అన్నవరం: స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని జీవన జ్యూయలరీ షాపులో చోరీకి శుక్రవారం ఇద్దరు దుండగులు విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...సాయంత్రం నాలుగు గంటలకు జీవన జ్యూయలరీ షాపులోకి హెల్మెట్ ధరించిన ఇద్దరు వచ్చారు. ఆ సమయంలో షాపులో యజమాని బంధువు మంగరాజు ఉన్నాడు. అతను కస్టమర్‌లు వచ్చారని యజమాని వరదా లక్ష్మణరావును పిలిచాడు. ఆ షాపు మేడపై ఉంటున్న యజమాని కిందకు దిగి వచ్చి వారిని హెల్మెట్ తీయమని అడిగాడు. దాంతో వారిలో ఒకడు సుత్తితో అతనిపై దాడి చేయగా మంగరాజు అడ్డుగా రావడంతో అతనిపై కూడా దాడి చేశాడు. దీంతో వారు గట్టిగా కేకలు వేయగా మేడ మీద నుంచి యజమాని భార్య రాజేశ్వరి కిందకు రాగా ఆమైపె కూడా దాడి చేశారు. అదే సమయంలో దుండగుల్లో ఒకరు ఆ షాపులోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు మూట కట్టాడు. అయితే ఆ జ్యుయలరీ షాపులో నుంచి అరుపులు వినిపిస్తుండడంతో స్థానికులు ఆ షాపు అద్దాల నుంచి లోపలకు చూడగా లోపల ఆ దుండగులు దాడి చేస్తున్న విషయం కనిపించింది. ఆ దుండగులు ఇద్దరు ఆ షాపులోనుంచి వెలుపలకు వచ్చి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు వారిని పట్టుకున్నారు. ఆ దుండగులు ఇద్దరు తొండంగి మండలం ఏ కొత్తపల్లి గ్రామానికి చెందినవారని, వారిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాజు, మరొకరు సర్వేయర్ అఖిల్‌గా గుర్తించారు. సమాచారం అందడంతో ఎస్‌ఐ శ్రీహరిబాబు అక్కడకు వచ్చి ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గాయపడిన షాపు యజమాని లక్ష్మణరావు, ఆయన భార్య రాజేశ్వరి, అతని బంధువు మంగరాజులను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment