నూతనోత్సాహంతో పథకాల అమలు
కలెక్టర్ ప్రశాంతి
సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): నూతన సంవత్సర వేళ ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను, ప్రజా ప్రయోజన పథకాలను అమలు చేయడంలో నూతనోత్సాహంతో పని చెయ్యాలని కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో నూతన సంవత్సర వేళ అభినందనలు అందజేసేందుకు తనను కలిసిన అధికారులతో కలెక్టర్ ప్రశాంతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, కార్పొరేషన్ కమిషనర్ కేతన గార్గ్, ఆర్డీఓలు ఆర్.కృష్ణ నాయక్, రాణి సుస్మిత, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన కారణంగా సంతాప దినాలు నేపథ్యంలో ఆడంబరాలకు దూరంగా నూతన సంవత్సర కార్యక్రమాన్ని నిర్వహించారు.
జోన్ 2 లో స్టాఫ్ నర్సుల
పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య, ఆరోగ్యశాఖ జోన్ 2 పరిధిలో ఖాళీగా ఉన్న స్టాఫ్‌నర్స్‌ల పోస్టుల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ పద్మశశిధర్ బుధవారం తెలిపారు. జోన్ 2 పరిధి అయిన పూర్వపు తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో ఒక సంవత్సరం ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా పూర్తి చేసిన దరఖాస్తులను రాజమహేంద్రవరంలోని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు సీడబ్ల్యూ.ఏపీ.నిక్.ఇన్ వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు.
అంతర్వేది ఉత్సవాలపై
నేడు సమీక్ష
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో వచ్చే నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. దీనిపై గురువారం అంతర్వేదిలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అమలాపురం ఆర్డీఓ కె.మాధవి సమక్షంలో సమీక్ష జరగనుంది. ఉత్సవాల నిర్వహణపై ఆయా శాఖల అధికారులకు ఆమె దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఉత్సవాలకు సంబంధించిన ముహూర్త పత్రికను ఆలయ అర్చకులు, వేదపండితులు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణకు అందజేశారు. ఈ మేరకు దేవస్థానం ఆలయ ప్రాంగణంలో జరిగే సమావేశానికి తగిన ఏర్పాట్లు బుధవారం పూర్తి చేశారు. ముహూర్తం ప్రకారం ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 12–55 గంటలకు స్వామివారి కల్యాణం, 8వ తేదీ మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం, 12వ తేదీ పౌర్ణమి స్నానాలు, 13నతెప్పోత్సవం ఉంటుందని అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
కిక్కిరిసిన అయినవిల్లి
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారి ఆలయం బుధవారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి పంచామృత అభిషేకాల్లో నలుగురు, లఘున్యాస అభిషేకాల్లో 145 మంది, పరోక్ష అభిషేకాల్లో ఇద్దరు, స్వామివారి గరిక పూజలో ముగ్గురు, ఉండ్రాళ్ల పూజలో ఒకరు, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 27 మంది పాల్గొన్నారు. ఒక చిన్నారికి అక్షరాభ్యాసం, ఐదుగురికి అన్నప్రాసన, ఆరుగురికి తులాభారం నిర్వహించారు. 74 మంది వాహన పూజ చేయించుకోగా, స్వామివారి అన్నప్రసాదం 6,598 మంది భక్తులు స్వీకరించారు. ఈ ఒక్కరోజే రూ.4,49,861 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ, ఏసీ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment