చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేశారు
రాజమహేంద్రవరం రూరల్: అబద్ధపు హామీలు, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆరునెలల కాలంలోనే రూ.లక్ష కోట్లకు పైగా అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 2024 ఎన్నికల ముందు ఎన్‌డీఏ కూటమి అప్పటి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేసిందన్నారు. ప్రతి రోజు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, శ్రీలంక అవుతుందని, దివాలా తీస్తుందని ప్రచారం చేశారన్నారు. వైఎస్ జగన్ పాలనలో రూ.14 లక్షల కోట్లు అప్పులు పాలైందని ప్రచారం చేశారన్నారు. తీరా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో, కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కల్లో, కాగ్‌నివేదికలో ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.7.5 లక్షల కోట్లు అని తేలిందన్నారు. అది కూడా 2014–2019 చంద్రబాబు పాలనలో చేసిన రూ.4.5 లక్షల కోట్లు అప్పు కలిపితే అన్నారు. వైఎస్ జగన్ పాలనలో కరోనా వచ్చినప్పటికీ కేవలం రూ.3లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. గణనీయంగా ఆదాయం పెంచి, సంక్షేమం అంటే ఇదీ అనేలా జగన్ పాలన సాగిందన్నారు.
అప్పు ఎలా ఒప్పు అయ్యింది?
చంద్రబాబు రూ.లక్ష కోట్ల అప్పులు చేశారు. ఆనాడు తప్పు అన్న అప్పు ఈరోజు ఒప్పు ఎలా అయ్యిందని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. రైతులకు సంబందించి ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. వైఎస్ జగన్ నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ వంటి వినూత్న మార్పులు తీసుకువస్తే..తెలుగుని కూనీ చేశాడని అసత్య ప్రచారం చేశారన్నారు. చంద్రబాబు అబద్దం సెక్సెస్ అయ్యింది కానీ ప్రజలు ఫెయిలయ్యారన్నారు. ఈ ప్రభుత్వం ఆరుమాసాల కాలంలో చెప్పినవన్నీ అబద్దాలని ప్రజలు తెలుసుకున్నారన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు ఏమీ చెప్పినా ప్రజలు నమ్మని స్థితి ఏర్పడిందని వేణుగోపాలకృష్ణ అన్నారు.
ఆరు నెలల్లో రూ.లక్ష కోట్లకు పైగా అప్పు
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ
జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment