దిగుబడి తగ్గి.. ఎగుమతులు పెరిగి
సాక్షి, అమలాపురం/ అంబాజీపేట: అద్భుత పోషకాలు ఉండే కొబ్బరి ధర అంతకంతకూ పెరుగుతోంది.. మార్కెట్‌లో సంక్రాంతి జోష్ నెలకొంది. అమృతధారతో ఊపిరినిలిపే కొబ్బరికి మళ్లీ ‘ధర’హాసం వచ్చింది.. పూజా ద్రవ్యంగా, పలు వంటకాల్లో ప్రధానంగా వాడే, నూనెతో మంచి ఆరోగ్యాన్ని కలిగించే ఈ నారీకేళం ధర ఊపందుకుంది. పచ్చి కొబ్బరి కాయతోపాటు కురిడీ ధర సైతం పెరగడంతో ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కొబ్బరి మార్కెట్‌లో ఎగుమతుల సందడి మొదలు కానుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, కోనసీమ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 1,10,317 ఎకరాల్లో సాగవుతోంది. ఇటీవల కొబ్బరి దిగుబడి తగ్గడంతో ధర పెరిగిన విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నుంచి నవంబర్ వరకూ పచ్చికొబ్బరి వెయ్యి కాయల ధర రికార్డు స్థాయిలో రూ.18,500 వరకూ పెరిగింది. తరువాత ధర తగ్గినా రూ.14 వేల వద్ద స్థిరంగా ఉంది. అయితే మళ్లీ ధర పెరగడం విశేషం. ప్రస్తుతం మార్కెట్‌లో పచ్చి కొబ్బరి, నిల్వ ముక్కుడు కాయఽ ధర రూ.14,500 వేల రూ.15 వేలకు చేరింది. వారం రోజుల కిందట ధర రూ.13 వేల నుంచి రూ.13,500 వరకూ ఉండేది. ఇది మరింత పెరుగుతోందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్ల కాలంలో కొబ్బరి ఒక ఏడాది సగటు ధర రూ.9 వేలు ఉండేది. అటువంటిది ఇప్పుడు రూ.14,500ల నుంచి రూ.15 వేలు ఉండడం రైతులకు ఒక విధంగా ఊరటనిచ్చే అంశం.
కురిడీ ధర సైతం
పచ్చి కొబ్బరితోపాటు కురిడీ ధర సైతం రెండు రోజులుగా పెరుగుతోంది. రెండు వారాల కిందట కురిడీ కొబ్బరి వెయ్యింటికి పాతకాయల్లో గండేరా రూ.15 వేలు, గటగట రూ.13,500, కొత్త కాయల్లో గండేరా రూ.14 వేలు, గటగట రూ.12,500లు ఉండేవి. ఇప్పుడు వాటి ధరలూ పెరిగాయి. పాత కురిడీ కొబ్బరి వెయ్యింటికి గండేరా రూ.17,500, గటగట రూ.16,000, కొత్త కురిడీ గండేరా రూ.16,800, గటగట రూ.15 వేల వరకూ పెరిగాయి. రకానికి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ పెరగడం గమనార్హం.
రోజుకు వంద లారీల ఎగుమతి
దిగుబడులు ఆశాజనకంగా ఉన్న సమయంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 150 లారీల వరకూ కొబ్బరి లోడు హైదరాబాద్‌తోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు జరిగేవి. ఇప్పుడు దిగుబడి తక్కువగా ఉండడంతో ధర ఉన్నా ఎగుమతులు తగ్గాయి. ఇప్పుడు రోజుకు 70 నుంచి 100 లారీల వరకూ ఎగుమతి అవుతోందని అంచనా.
ఫ కొబ్బరి మార్కెట్‌లో సం‘క్రాంతి’ జోష్
ఫ వెయ్యి కాయల ధర రూ.15 వేలు
ఫ కురిడీ రూ.18,500 వరకూ
పెరుగుదల
ఫ సంక్రాంతికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొబ్బరి వినియోగం కొంత వరకూ పెరుగుతోంది. అలాగే ఈ సీజన్‌లో పండగలకు సైతం వినియోగిస్తారు. ఈ కారణంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పెరిగాయి.
ఫ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దిగుబడి తగ్గడం కూడా కొబ్బరి ధర పెరుగుదలకు కారణమైంది. ఎకరాకు కొబ్బరి దిగుబడి ఈ సీజన్‌లో సగటు 1,200 కాయలు కాగా, ప్రస్తుతం 400 కాయలు మాత్రమే దిగుబడిగా వస్తున్నాయి.
ఫ తమిళనాడు, కర్ణాటక రాషా్‌ట్రల్లో సైతం దిగుబడులు తగ్గడంతో కూడా రేటు పెరుగుతోంది. ఆ రాష్ట్రాల నుంచి ఎగుమతులు తక్కువగా ఉండడంతో కొబ్బరి ధర పెరగడానికి కారణమైంది.
ఫ కురిడీ కొబ్బరి ధరలు పెరగడానికి పచ్చి కొబ్బరి కాయ ధర గత అక్టోబర్ నుంచి అధికంగా ఉండడమే కారణం. సాధారణంగా పచ్చి కొబ్బరి ధరలు తక్కువగా ఉంటే రైతులు వాటిని వలిపించి అటకలపై.. కొబ్బరి ప్యాక్ హౌస్‌ల్లో నిల్వ ఉంచి కురిడీ కొబ్బరి తయారు చేస్తారు. అక్టోబర్ నుంచి కొబ్బరి ధర పెరగడంతో అటక పోత, ప్యాక్ హౌస్‌ల్లో నిల్వ ఉంచడం తగ్గింది. దీనివల్ల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఎంఎస్‌పీ పెంచిన కేంద్రం
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతు ధరను పెంచిన విషయం తెలిసిందే. మిల్లింగ్ కోప్రా (ఎండు కొబ్బరి) క్వింటాల్‌కు రూ.422 చొప్పున, బాల్ కోప్రా (కొబ్బరి కురిడీ) క్వింటాల్‌కు రూ.100 చొప్పున పెంచింది. ప్రస్తుతం మిల్లింగ్ కోప్రా ధర క్వింటాల్ రూ.11,582 వరకూ ఉండగా, తాజా పెంపుతో రూ.12 వేలు అయ్యింది. బాల్ కోప్రా ధర రూ.12 వేలు ఉండగా ఇప్పుడు పెంచిన ధరతో రూ12,100 వరకూ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment