రైస్‌మిల్లులో విజిలెన్స్ తనిఖీలు
గోపాలపురం: మండలంలోని కోమటికుంట మాతంగి అమ్మ రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించిన జిల్లా విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ, టీడీడీ బోర్డు పాలకమండలి మాజీ సభ్యుడు మేకా శేషుబాబుకు చెందిన మాతంగమ్మ రైస్ మిల్లులో టన్నుల కొద్దీ రేషన్ బియ్యం ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదే సందర్భంలో మాతంగమ్మ రైస్ మిల్లులో భాగస్వామి అయిన కోమటికుంట గ్రామానికి చెందిన వెలగా శ్రీరామమూర్తి రైసు మిల్లులో తనకు తెలియకుండా పలు అవకతవకలకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలంటూ రైసుమిల్లు వద్ద నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బకాయిదారులైన రైతులు, లారీ యజమానులు రైసు మిల్లు వద్దకు చేరుకొని బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మేకా శేషుబాబు, వెలగా శ్రీరామమూర్తి వర్గీయులను చెదరకొట్టారు.
జిల్లా విజిలెన్స్ డీఎస్పీ కె.తాతారావు, సీఐలు గోపాలకృష్ణ, వెంకటరాజు, సివిల్ సప్‌లై ఏఎస్‌వో రామాంజనేయులు, గోపాలపురం తహసీల్ధార్ కె అజయ్‌బాబులు మిల్లులో తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యంతో వచ్చిన లారీని నిలుపుదల చేసి మాతంగమ్మ రైసుమిల్లులో నిల్వలను పరిశీలించిన అనంతరం వివరాలను జిల్లా అధికారులకు తెలియజేస్తామన్నారు. అర్ధరాత్రి వరకూ మిల్లులో తనిఖీలు కొనసాగాయి.
06జీఓపి02 :
రైసుమిల్లు వద్ద ఇరువర్గాలను సముదాయిస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment