స్తంభించిన పేపర్‌మిల్లు
● సీఎం ఆదేశాలు సైతం బేఖాతర్
● మొండిపట్టు వీడని యాజమాన్యం
● అర్ధరాత్రి లాకౌట్ ప్రకటించిన వైనం
● అంతే పట్టుదలతో కార్మికులు
● కార్మిక నాయకులు పలు దఫాల చర్చలు
● కార్మికులకు అండగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు
జక్కంపూడి రాజా
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గత 70 ఏళ్లుగా రాజమహేంద్రవరం నగరానికి తలమానికంగా ఉన్న ఆంధ్రాపేపర్ మిల్లు నేడు స్తంభించింది. ఐదు నెలలుగా యాజమాన్యం కార్మికులకు మధ్య వేతన సవరణ విషయంలో తర్జనభర్జన నడుస్తోంది. చర్చలు విఫలం కావడంతో కార్మికులు నాలుగురోజుల నుంచి విధులను బహిష్కరించారు. దీంతో యజమాన్యం ఆదివారం అర్ధరాత్రి లాకౌట్ ప్రకటించింది. ఏడు పదుల ప్రస్థానంలో పేపర్ మిల్లు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. కరోనా సమయంలో నష్టాలలో ఉన్నా నేడు మళ్లీ ఉత్పత్తి పుంజుకుని లాభాలబాటలో నడుస్తోంది. ఎంతోమంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నీడనిచ్చింది. కాని నేడు అదే కార్మికులకు అన్యాయం జరుగుతున్నా యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.
సీఎం హామీ నమ్మండి – ఆందోళన
విరమించండి....
పేపరు మిల్లు కార్మికులకు నష్టం జరగకుండా మంచి అగ్రిమెంటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి కార్తికేయ మిశ్రాకు శనివారం ఆదేశాలు ఇచ్చారు. వేతన ఒప్పందం కోసం పేపరుమిల్లు వద్ద మిల్లు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన కార్మికులతో ఆదివారం కూటమి నాయకులు చర్చలు జరిపారు. సీఎం చంద్రబాబుతో మీ విషయం చెప్పామని, సమ్మె విరమించాలని కోరారు. అయినా సరే అగ్రిమెంట్ అయితేనే తాము సమ్మె విరమిస్తామని కరాఖండిగా చెప్పారు. దీనితో కూటమి నాయకులు చేసేదేమీ లేక వెళ్లిపోయారు.
2018లో వేతన సవరణ
2018 సంవత్సరంలో ఒకసారి వేతన సవరణ జరిగింది. తరువాత వేతన సవరణ కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాని కూటమి ప్రభుత్వం రావడంతో మరోసారి వేతన సవరణ చేయాలని కార్మిక సంఘాలు భావించాయి. కూటమి నాయకులు అండగా ఉంటారనే ఉద్దేశంతో వీరంతా సమ్మెకి ఉపక్రమించారు. తీరా వీరంతా సమ్మెను ప్రారంభించి కూటమి నాయకులకు తెలియజెప్పడంతో వారంతా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లారు. కాని సీఎం చంద్రబాబు ఆదేశాలను సైతం యాజమాన్యం లెక్కచేయలేదు. తమ వేతనం రూ. 10 వేలు పెంచాలని సమ్మెకి దిగిన కార్మికులు డిమాండ్ చేస్తుండగా యాజమాన్యం రూ.3,250 మాత్రమే పెంచుతానంటోంది. కార్మికులకు ఈ ప్రతిపాదన నచ్చకపోవడంతో తిరిగి సమ్మె బాట పట్టారు.
వేతన సవరణ చేయాల్సిందే
మాకు న్యాయ పరంగా చెందాల్సిన వేతన సవరణని చేయమని అడుగుతున్నాము. కాని యాజమాన్యం మొండి వైఖరిని వదలడం లేదు. మాకు న్యాయం జరిగే వరకు సమ్మెని విరమించం.
– హరిబాబు, ఆపరేటర్
కార్మికుల భయపెడుతున్నారు
కార్మికులను భయపెడుతూ పనిచేయించుకుంటున్నారు. మాకు వేతన సవరణ న్యాయంగా చేయాల్సి ఉంది. జనవరి 2వ తేదీ నుంచి విధుల్లోకి వెళ్లకుండా సమ్మె చేస్తున్నాం. మా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నాం. కాని మాకు జీతాలు పెంచడానికి యాజమాన్యం ససేమిరా అంటున్నారు.
– టి.నరసింహమూర్తి, కళాసి
కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి మరీ దారుణం
నేను 18 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాను. జీతం రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. వేతన ఒప్పందం జరిగితే నా జీతం రూ.22 వేలు అవుతుంది. మరికొంత మందికి రూ.8వేల నుంచి రూ.9 వేల వరకు జీతం అందుతోంది. 11 ట్రేడ్ యూనియన్ అనుబంధ సంస్థలు సంప్రదింపులు జరిపిన యాజమాన్యం ముందుకు రావడం లేదు.
– రామ్‌కుమార్, కాంట్రాక్ట్ ఉద్యోగి
పరిశ్రమలు బాగుంటే పదిమందికి ఉపాధి...
ప్రభుత్వాలు అయినా, అధికారులైన పరిశ్రమలు బాగుండాలని కోరుకుంటారు. దానికి కారణం పరిశ్రమలు బాగుంటే కొంతమందికి ప్రత్యక్షంగానూ, మరికొంత మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది. పేపర్‌మిల్లు ద్వారా ఎప్పుడూ సీఎస్‌ఆర్ నిధుల రూపంలో గ్రామానికి గాని, ఈ చుట్టుపక్కల గాని వెచ్చించలేదు. పేపర్‌మిల్లు ద్వారా గాలి, నీరు కలుషితం అవుతుంది. వైఎస్సార్ సీపీ తరఫున కార్మికులకు అండగా ఉంటాం.
– జక్కంపూడి రాజా, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
న్యాయపోరాటం చేస్తాం...
కార్మికుల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఒక సంఘంతో మరొక సంఘానికి గొడవలు పెట్టి యాజమాన్యం పబ్బం గడుపుతోంది. మేనేజ్‌మెంట్ మొండి వైఖరి విడనాడకపోతే కార్మికుల తరఫున రాజమహేంద్రవరం బంద్ కూడా నిర్వహిస్తాం. కార్మికుల అవేదనను అర్థం చేసుకొని యాజమాన్యం ముందుకు రావాలి. కార్మికులకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తాం.
– శ్రీఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం,
ఏపీఐసీసీ మాజీ చైర్మన్
అర్ధరాత్రి 2 గంటలకు లాకౌట్
ఆదివారం ఆర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2 గంటల ప్రాంతంలో పేపర్‌మిల్లు యాజమాన్యం లౌకౌట్ నోటీసులను గేట్‌కి అంటించి గేట్ లోపలకి ఎవరూ రాకుండా గేట్‌కి తాళాలు వేసింది. సోమవారం ఉదయం సమ్మే చేయడానికి పేపర్‌మిల్లుకి చేరుకున్న కార్మికులకు లాకౌట్ నోటీసులు కనిపించడంతో ఆందోళనకు దిగారు. యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పేపర్‌మిల్లు వద్ద నిరసన చేపట్టారు. 750 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 3,500 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఆందోళనలో పడింది. రాజమహేంద్రవరం నుంచే కాకుండా పరిసర ప్రాంతాలు కోరుకొండ, బూరుగుపూడి, కోలమూరు, రాజానగరం, వేమగిరి నుంచి కూడా ఇక్కడకు పని చేయడానికి వస్తారు. వీరంతా లాభాల్లో ఉన్న పేపర్‌మిల్లుని లాకౌట్ ఎలా చేస్తారని, తామంతా 30 సంవత్సరాల నుంచి పని చేస్తున్నామని మాకు దిక్కెవరని ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment