నేటి నుంచి విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ
రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ (ఇన్‌చార్జి) ఠాకూర్ రామసింగ్ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై ఏిపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో ఈ నెల 7,8,10 తేదీలలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్టు ఎస్‌ఈ కే.తిలక్ కుమార్ సోమవారం తెలిపారు. మూడు రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రత్యక్షంగా 7 ,8(విజయవాడ బృందావన కాలనీ)తేదీలలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు , 10వ తేదీ ( కర్నూలు ఏపీఈఆర్సీ కార్యాలయం ) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా ఎస్‌ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలిపేందుకు రాజమహేంద్రవరంలోని ఎస్.ఈ ఆఫీస్, టౌన్ డివిజన్ ఈఈ నక్కపల్లి శామ్యూల్, రూరల్ డివిజన్ ఈఈ దాట్ల శ్రీధర్ వర్మకు తెలియపరిస్తే ముందస్తుగా నమోదు చేసుకున్న వినియోగదారుల అభ్యంతరాలు విన్న తరువాత, విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితో నమోదు చేసుకోని వినియోగదారుల అభ్యంతరాలు వింటారన్నారు. వివరాల కోసం ఏఈ కమర్షియల్ రాజమహేంద్రవరం 94906 10850, ఏఈ టెక్నీకల్ టౌన్ డివిజన్ 94906 10094 నంబర్‌లలో సంప్రదించాలన్నారు.
సాక్షి సీనియర్ సబ్ ఎడిటర్ ప్రభాకరరావు మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సాక్షి సీనియర్ సబ్ ఎడిటర్ జ్యోతుల ప్రభాకరరావు (59) సోమవారం మృతిచెందారు. రాజమహేంద్రవరంలోని జేఎన్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన బొల్లినేని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తల వెనుక రెండు బలమైన గాయాలు కావడం, తల లోపల రక్తం అధికంగా స్రవించడంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఐసీయూలో వైద్య చికిత్సలు నిర్వహించినా పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందారు. నాలుగు దశాబ్దాల పాటు రిపోర్టర్‌గా, డెస్క్‌లో సబ్ ఎడిటర్‌గా ప్రభాకరరావు సేవలు అందించారు. కాకినాడలో తొలుత స్థానిక పత్రిక సర్కార్ ఎక్సప్రెస్‌లో రిపోర్టర్‌గా ప్రభాకరరావు పాత్రికేయ జీవితం ఆరంభించారు. విజయవాడలో ఆంధ్రజ్యోతి, రాజమహేంద్రవరంలో వార్తలో సబ్ ఎడిటర్‌గా పని చేశారు. సాక్షి ప్రారంభం నుంచి రాజమహేంద్రవరం యూనిట్‌లో ఆయన పనిచేశారు. ఆయన మొక్కల ప్రేమికుడు. తీరిక వేళల్లో మినీ నర్సరీని నడుపుతూ, అందరితో సరదాగా, స్నేహా పూర్వకంగా, ఆత్మీయంగా మెలిగేవారు. ప్రస్తుతం ఆ నర్సరీనీ ఆయన కుమారుడు నిర్వహిస్తున్నాడు. మృతిచెందిన ఆయన భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మంగళవారం ఉదయానికి ఆ కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అనంతరం కోటిలింగాల శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన మృతికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ సెక్రటరీ ఎం.శ్రీరామమూర్తి, ప్రెస్‌క్లబ్ సభ్యులు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. పాత్రికేయులందరూ ఉదయం 10 గంటలకు ప్రభుత్వాసుపత్రికి చేరుకోవాలని వారు కోరారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 28 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్)కు 28 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిశోర్.. ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్ (ఎస్‌బీ) శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ (డీసీఆర్‌బీ) పవన్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment