అన్నదాతకు కరెంటు కోత! | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు కరెంటు కోత!

Published Sun, Jan 19 2025 2:27 AM | Last Updated on Sun, Jan 19 2025 2:27 AM

అన్నద

అన్నదాతకు కరెంటు కోత!

సాక్షి, రాజమహేంద్రవరం: అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం నాంది పలికింది. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై సర్దుబాటు భారం మోపింది. ఇది చాలదన్నట్లు అన్నదాతలకు కరెంటు కష్టాల కడగండ్లు మిగిల్చేందుకు నాంది పలికింది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్‌ సరఫరా ఇస్తున్నామని ప్రకటనలు గుప్పించిన కూటమి సర్కార్‌.. కొద్ది రోజుల్లోనే విద్యుత్‌ సరఫరాను 9 నుంచి 8 గంటలకు తగ్గించింది. తాజాగా మరో గంట కుదించింది. విద్యుత్‌ అధికారుల ద్వారా ఎలాంటి ప్రకటనా చేయకుండా.. గుట్టు చప్పుడు కాకుండా అనధికారిక కోతలు అమలు చేస్తోంది. తద్వారా వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తామనే సంకేతాన్ని రైతులకు ఇస్తోంది.

ఇదీ సంగతి

జిల్లా వ్యాప్తంగా 7,77,428 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలవి 10,607, ప్రైవేటువి 7,66,821, వ్యవసాయ కనెక్షన్లు 25 వేలకు పైగా ఉన్నాయి. గతంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు తొలుత రెండు విడతలుగా తొమ్మిది గంటల విద్యుత్‌ సరఫరా చేసేవారు. అనంతరం తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్‌) అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకుండానే అనధికారిక కోతలకు నాంది పలికాయి. దీంతో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరగక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.

మెట్టకు బోర్లే ఆధారం

జిల్లాలో ప్రస్తుతం వరి సాగుకు నీటి లభ్యత ఆవశ్యకత పెద్దగా లేకున్నా.. నెలాఖరుకు అవసరమవుతుంది. మెట్ట ప్రాంతాలైన దేవరపల్లి, గోపాలపురం, చాగల్లు, నల్లజర్లలో కొంత భాగం, నిడదవోలు రూరల్‌, పెరవలి మండలంలోని కొన్ని గ్రామాలు, గోకవరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో ఎక్కువ శాతం రైతులు సాగుకు బోర్ల నీటి పైనే ఆధారపడతారు. మామిడి, కొబ్బరి, ఆయిల్‌పామ్‌, చెరకు, జీడిమామిడి, పొగాకు, పత్తి తదితర పంటలకు వ్యవసాయ విద్యుత్‌ మోటార్ల ద్వారా ఆందించే బోరు నీరే ఆధారం. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోతే కీలక దశలో నీటి ఎద్దడి ఏర్పడి ఆయా పంట దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. అయితే, విద్యుత్‌ సరఫరా సక్రమంగా చేస్తున్నామని అధికారులు చెబుతుండగా.. 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని రైతులు అంటున్నారు. అదేమని అడిగితే లోడ్‌ రిలీఫ్‌ (ఎల్‌ఆర్‌) ఇచ్చామంటూ విద్యుత్‌ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మెయిన్‌ సప్లై పోయిందని, ఎప్పుడొస్తుందో చెప్పలేమనే సమాధానం ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి రోజూ గంటపాటు అనధికారికంగా విద్యుత్‌ కోత విధిస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో కనీసం 5 గంటల సరఫరా కూడా సక్రమంగా అందుతుందో లేదోననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

సరఫరా ఇలా..

సాధారణంగా వ్యవసాయ కనెక్షన్లకు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తొమ్మిది గంటల పాటు పగటి పూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలి. నెల రోజులుగా రోజుకు గంటపాటు కోత విధించి, సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే ఇస్తున్నారు. రెండు రోజుల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ మాత్రమే విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. మరమ్మతులు, ఇతర అవసరాల పేరుతో ప్రతి రోజూ ప్రతి లైన్‌ను అరగంట నుంచి గంట వరకూ నిలిపివేస్తున్నారని చెబుతున్నారు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

రోజుకు 9 గంటల సరఫరా

కూటమి ప్రభుత్వ హయాంలో

తొలుత గంట తగ్గింపు

తాజాగా మరో గంట కుదింపు

9 గంటల స్థానంలో 7 గంటలకే పరిమితం

దీనికి అనధికారిక కోతలు తోడు

కీలక దశలో కోతలతో రైతుల ఆందోళన

జిల్లాలో విద్యుత్‌ కనెక్షన్లు

విద్యుత్‌ డివిజన్‌ కేటగిరీ–1 కేటగిరీ–2

(ఇళ్లు) (పరిశ్రమలు,

వ్యవసాయం)

నిడదవోలు 2,25,071 23,735

రాజమహేంద్రవరం రూరల్‌ 1,98,390 20,528

రాజమహేంద్రవరం అర్బన్‌ 2,12,425 32,761

గతం.. ఘనం

వ్యవసాయానికి పగటి పూటే నిరంతరాయంగా 9 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. అభివృద్ధి పనులకు నాంది పలికింది. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టింది. అప్పటికి ఉన్న ఫీడర్ల సామర్థ్యం సరిపోదని భావించి, ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటీ అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఆర్‌డీఎస్‌ఎస్‌ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రూ.411 కోట్ల వ్యయంతో 26 కొత్త విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి నాంది పలికింది. సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, వ్యవసాయ ఫీడర్లను సిద్ధం చేసింది. వ్యవసాయ కనెక్షన్లకు ప్రత్యేకంగా 1,920 కిలోమీటర్ల మేర 11 కేవీ డెడికేటెడ్‌ లైన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 38 వేలకు పైగా విద్యుత్‌ స్తంభాలు అమర్చింది. 132/33 కేవీ, 400/132 కేవీ, 220/33 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి నిర్మాణాలు పూర్తయి, సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్నింటిని అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. డెడికేటెడ్‌ లైన్‌ ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి సరఫరా చేసే సమయంలో చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమలకు విద్యుత్‌ నిలిపివేసే అవస్థలు తప్పాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
అన్నదాతకు కరెంటు కోత!1
1/1

అన్నదాతకు కరెంటు కోత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement