పారదర్శకంగా రీసర్వే
నిడదవోలు రూరల్: గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. మండలంలోని తాడిమళ్లలో చేపట్టిన రీసర్వేను శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాల్లో రీ సర్వేకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించి, ఎటువంటి పొరపాట్లకూ తావు లేకుండా భూముల రికార్డుల రూపొందించాలని చెప్పారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఒకటి చొప్పున 16 గ్రామాల్లో రీసర్వే చేపట్టామన్నారు. భూ సమస్యలపై వినతులు స్వీకరించాలని, రీ సర్వేతో నష్టపోయిన రైతుల ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ జరగకుండా చూడాలన్నారు. అనంతరం ఉనకరమిల్లి గ్రామంలో సీసీ రోడ్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడు బి.లక్ష్మీనారాయణ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ టి.వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ ఈఈ పి.రామకృష్ణారెడ్డి, ఎంపీడీఓ డి.లక్ష్మీనారాయణ, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ బి.ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
నేడు గరికపాటి
ఆధ్యాత్మిక ప్రవచనం
రాజమహేంద్రవరం రూరల్: స్థానిక శ్రీ సత్య సాయి గురుకులంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రవచనం జరగనుంది. శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాల్లో తొలి కార్యక్రమంగా ఈ ప్రవచనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘ప్రేమ – సేవ’ అనే అంశంపై గరికపాటి ఉపన్యసిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment