ఇలాంటి వరస్ట్ సీఎంను జీవితంలో చూడలేదు
● 7 నెలల కాలంలో చంద్రబాబు
చేసిందేమీ లేదు
● ఆయన అబద్ధాలకు హద్దూపద్దూ లేదు
● ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి కుట్ర
● గోదావరి, కృష్ణా ,పెన్నా నదుల
అనుసంధానం ఓ పెద్ద స్కెచ్
● మాజీ ఎంపీ హర్షకుమార్
రాజమహేంద్రవరం సిటీ: ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా కేవలం కమీషన్ల కోసం ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్న చంద్రబాబు లాంటి వరస్ట్ సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రద్దు చేసిన స్కీములన్నింటీని తిరిగి ప్రారంభిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ చేయలేదన్నారు. సీఎం అబద్ధాలకు హద్దూపద్దూ లేనే లేదని, ఆయన నిజస్వరూపాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అధికారం వచ్చి ఏడు నెలలైనా ఇప్పటి వరకూ కూటమి నాయకుల్లో వాటాలు కుదరక టిడ్కో ఇళ్లు ఇవ్వలేదన్నారు. జగన్ ప్రభుత్వం ఉండగా గత ఐదేళ్లలో దళితుల మీద చంద్రబాబు చూపిన ప్రేమ ఇప్పుడేమైందని, వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్ పాలన ఐదేళ్లూ ఏబీఎన్, టీవీ–5 చానళ్లలో ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారని, ఇప్పుడలా చేయడం లేదని, దళితులందరూ ఆ చానళ్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, బీసీ, కాపులకు సంబంధించిన పథకాల పరిస్థితి అర్థం కావడం లేదన్నారు. అమరావతి, స్టీల్‌ప్లాంట్ అభివృద్ధి అటకెక్కాయని, ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు దీనిపై నోరు మెదిపే మగాడు ఒక్కడూ లేకపోయాడని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పునర్నిర్మాణం ఎప్పడు మొదలు పెడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, మోదీ ఇద్దరూ దొంగలేనని, కలిసిపోయారని, ఇద్దరూ కలిపి పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను ఇతరులపై వేయటానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. లోపభూయిష్టంగా నిర్మాణాలు చేశారని హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జియాలజికల్ సర్వే నిర్వహించి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలా పడితే అలా నిర్మిస్తే తీవ్ర నష్టం సంభవించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కమీషన్ల కోసమే గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి రూ.85,000 కోట్లు కావాలంటున్నారన్నారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని, ఆయనతో రాష్ట్రం అభివృద్ధి చెందదని, ప్రాజెక్టుల పేరుతో దోచేసే ప్రయత్నం చేస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment