దొంగ బంగారానికి దొడ్డిదారి
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో భారీగా బంగారం, వెండి, వజ్రాలతో జ్యూయలరీ షాపు యజమాని పరారు కావడంతో పట్టణంలోని బులియన్ మార్కెట్ ఒక్కసారిగా ఉల్కిపడింది. నిందితుడి కోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి వేట కొనసాగిస్తున్నారు. గూడెంలో గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దొంగ బంగారం కొనడం, నకిలీ బంగారం తయారు చేయించండం వంటివి ఎన్నో.. దొంగ బంగారం వచ్చిన వెంటనే కరిగించే ఏర్పాట్లు కూడా ఉండేవి. బిల్లులేని వ్యాపారం, ఎస్టిమేటు కాపీలతో ఆభరణాల తయారీ, తప్పుడు పనులు చేసే వారికి గూడెం రాచమార్గంగా కనిపించింది. తాజాగా బంగారు టోకరా ఉదంతం ఇక్కడ బంగారం వ్యాపారంలోని లొసుగులను బట్టబయలు చేసింది.
మూడు బిస్కెట్లు.. ఆరు లాకెట్లు
గూడెంలో దొడ్డి దారిన బంగారం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగేది. అమాంతంగా కోటీశ్వరులు కావాలనే ఆశలతో దొంగ బంగారం కొని సొమ్ము చేసుకునేవారు. ఏడాదికి ఒకటిలేదా రెండు కేసులు పోలీసులకు చెబితే చాలనే భావన పెంచుకున్నారు. అదే ఫార్ములాతో కొన్నేళ్ల పాటు వ్యాపారం సాగించారు. వీరి బాగోతం తణుకులోని ఒక నగల దుకాణంలో జరిగిన చోరీతో బహిర్గతమైంది. తణుకులోని నరేంద్ర సెంటర్‌లో ఉన్న జడావి జ్యూయలర్స్‌లో భారీ చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి చేధించే క్రమంలో పోయిన నగలను తాడేపల్లిగూడెంలోని టూటౌన్‌కు చెందిన వ్యాపారి ఒకరు కొన్నట్లు గుర్తించారు. బంగారు దుకాణంలో విక్రయించే ఆభరణాల వెనుక ట్రేడ్‌మార్కు గుర్తు ఉంటుంది. ఆ గుర్తులను బట్టి దొంగిలించిన నగలు గూడెం దుకాణదారుడు కొన్నట్టుగా పోలీసులకు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత అరెస్టు చేసి ప్రశ్నించగా.. గూడెం వ్యాపారి నేరాన్ని అంగీకరించాడు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత ఒక వ్యాపారి ప్రోద్బలంతో టూటౌన్‌లో మోడరన్ కేఫ్ దాటాక బంగారు దుకాణంలో చోరీకి ఏకంగా సొరంగం తవ్వి ఆనక పోలీసులకు దొరికిపోయారు. 2001 సంవత్సరంలో దొంగబంగారు వ్యాపారం గూడెంలో మూడు బిస్కెట్లు, ఆరు లాకెట్లుగా సాగింది. దొంగ మార్గంలో బంగారం, అభరణాలు కొనుగోలు చేసిన కొందరు వ్యాపారులు ఇళ్ల దగ్గర సెటప్ చేసుకున్న ఊక పొయ్యల్లో కరిగించే ఏర్పాట్లు ఉండేవి.
వెండి వస్తువులపై బంగారు పూతతో మోసం
గతంలో ఒక వ్యాపారి బంగ్లాదేశ్ నుంచి బంగారు ఆభరణాలు తయారుచేయడానికి వచ్చిన వారితో నాసిరకం బంగారం వస్తువులు తయారు చేయించేవాడు. వెండి వస్తువులపై రాగి కోటింగ్, దానిపై బంగారు పూత వేయించి విక్రయించేవాడు. ఇలా వస్తువులు తయారు చేయడానికి పనివారికి అడ్వాన్సులుగా పెద్ద మొత్తంలో సొమ్ములు ఇచ్చేవారు. సొమ్ములు సకాలంలో చెల్లించకపోయినా, వస్తువులను సకాలానికి అందించక పోయినా వివిధ శిక్షలు వేసే వారు. రాత్రిపూట వివస్త్రల్ని చేయించి, సిగరెట్ వాతలు పెట్టేవారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి.
‘గూడెం బంగారం’ లోగుట్టు బట్టబయలు
వ్యాపారి పరారీతో గత ఉదంతాలు
గుర్తు చేసుకుంటున్న జనం
Comments
Please login to add a commentAdd a comment