పాపికొండలకు పోటెత్తిన పర్యాటకులు
బుట్టాయగూడెం: పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ సెలవులకు వచ్చిన వారు బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి బోటు విహార యాత్రలో పాపికొండలు చేరుకుని అక్కడ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. గత 5 రోజులుగా పాపికొండల విహార యాత్రకు వెళ్తున్న వారి సంఖ్య పెరిగిందని అధికారులు చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనేక మంది పర్యాటకులు వారి బంధుమిత్రులతో వచ్చి పాపికొండల వద్ద సేదతీరుతున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో సుమారు 4 వేల మందికి పైగా సందర్శకులు పాపికొండల విహారయాత్రలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం వరకూ పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల తాకిడి ఎక్కుగానే ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగల దృష్ట్యా సుమారు 14 బోట్లు పర్యాటకుల కోసం నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
పర్యాటకుల కేంద్రంగా పేరంటాలపల్లి
అందాల గోదావరిపై పాపికొండల విహారయాత్ర పర్యాటకులకు పేరాంటాల పల్లి అనే కుగ్రామం పర్యాటక కేంద్రంగా ఉంది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఉన్న ఈ గ్రామం గోదావరి ఒడ్డున కొండల నడుమ ఉంది. పాపికొండల విహార యాత్ర అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మతల్లి గుడి వద్ద ఉన్న బోటింగ్ పాయింట్ నుంచి అన్ని బోట్లు విహారయాత్రకు పర్యాటకులను తీసుకుని పేరంటాలపల్లి వరకూ తీసుకువెళ్తాయి. అక్కడ కొండరెడ్లు తయారు చేసిన కళాకృతులు ఎంతో అందంగా ఉంటాయి. పండుగ వేళల్లో కొండరెడ్డి గిరిజనులు తయారు చేసిన వెదురు కళాకృతులు అధికంగా కొనుగోళ్లు జరిగినట్లు తెలిసింది. అలాగే పేరంటాలపల్లి వద్ద ఉన్న ఆశ్రమం సమీపంలో ఉన్న జలపాతం వద్ద తమ పిల్లలు ఎంతో ఎంజయ్ చేశారని పర్యాటకులు చెప్పారు.
బోటింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలి
గతంలో పాపికొండల విహారయాత్ర బోటు ప్రయాణాలు పట్టిసీమ, పోలవరం మీదగా కొరుటూరు, పేరంటాలపల్లి వరకూ జరిగేవి. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఇక్కడ బోటు పాయింట్లను తీసివేశారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా దేవిపట్నం గండిపోచమ్మ తల్లి గుడి, వీఆర్‌పురంలలో బోటు పాయింట్లు ఉన్నాయి. కొయిదా, కొరుటూరుల్లో బోటు పాయింటు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకులు
Comments
Please login to add a commentAdd a comment