శ్రీవారి క్షేత్రంలో నోటీసుల కలకలం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ప్రైవేట్ అలాగే ట్రస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని ఫంక్షన్ హాల్స్, లాడ్జీల యజమానులకు స్థానిక తహసీల్దార్ జేవీ సుబ్బారావు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. భూమికి సంబంధించిన ఆధారాలతో పాటు, ల్యాండ్ కన్వర్షన్, బిల్డింగ్ అప్రూవల్, ప్లాన్, ఫైర్ సేఫ్టీ అనుమతుల పత్రాలు, పార్కింగ్ స్థలం, వాటర్ సప్లయ్, ఎలెక్ట్రసిటీ, వేస్ట్ మేనేజ్‌మెంట్, రూముల కెపాసిటీ, క్రౌడ్ మేనేజ్‌మెంట్, జీఎస్టీలకు సంబంధించిన వివరాలను నోటీసు అందిన వారం రోజుల్లోగా అందించాలని నోటీసులో పేర్కొన్నారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు. ద్వారకాతిరుమల క్షేత్రంలో సుమారు 50 వరకు ఫంక్షన్ హాల్స్, లాడ్జిలు ఉండగా తొలిరోజు కొన్నింటికి మాత్రమే నోటీసులు అందించారు. మిగిలిన వాటికి అందించాల్సి ఉంది. క్షేత్రంలో ఎక్కువ ఫంక్షన్ హాల్స్, లాడ్జిలు పదేళ్ల క్రితం నిర్మించినవే. అప్పటి నుంచి యజమానులు పంచాయితీకి అన్ని పన్నులు చెల్లించి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి రెవిన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది. కావాలనే కొందరు వ్యక్తులు ఫంక్షన్‌హాల్స్, లాడ్జిలను టార్గెట్ చేసి, నోటీసులు ఇప్పించారని యజమానులు ఆరోపిస్తున్నారు. అధికారులు వేధింపులు ఆపకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment