వేమనకు నీరాజనం
అత్తిలి: మానవ జీవితానికి సంబంధించిన అనేక నిత్యసత్యాలను తనదైన శైలిలో తేట తెలుగు పదాలతో వర్ణించి తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన ప్రజా కవి యోగి వేమన. అత్తిలి మండలం ఆరవల్లిలో వేమనకు మందిరాన్ని నిర్మించి, ఏటా జనవరి 18న వేమన జయంతిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం వేమన 100వ జయంత్యుత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. వేకువజామున వెలగల దాసు వంశీయులు వేమనకు గోస్తనీ నది స్నానం చేయించారు. వేమన మందిరాన్ని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేమనను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భజన కీర్తనలు, కోలాట భజన, సినీ సంగీత విభావరి నిర్వహించారు. బ్యాండు మేళాలు, మంగళ వాద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ విశేషంగా అలంకరించిన పల్లకీపై వేమన చిత్రపటాన్ని ఉంచి గ్రామ పురవీధులలో ఊరేగించారు. వేమన పల్లకీ కింద నుంచి తల్లిదండ్రులు తమ చిన్నారులను దాటించారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆయుష్షు పెరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. ఉత్సవాలకు హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద సందడి నెలకొంది. వేమన జయంతి సందర్భంగా గ్రామంలో పండుగ వాతావారణం నెలకొంది. దేశ, విదేశాలలో ఉన్నవారు స్వగ్రామానికి చేరుకుని బంధుమిత్రులతో ఉత్సాహంగా గడిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేమన ఉత్సవ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వేమన ఉత్సవ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, స్థానిక ప్రముఖులు సత్తి వెంకట శ్రీనివాసరెడ్డి, గొలుగూరి శ్రీరామారెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు ఆనాల ఆదినారాయణ, వెలగల ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేమనను దర్శించుకున్న సినీ ప్రముఖులు
యోగి వేమనను గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డిలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి సత్కరించారు. క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న వాలీబాల్ పోటీలు, మహిళా కబడ్డీ పోటీలను తిలకించారు.
శునకాలకు అన్నదానం
ఆరవల్లి వేమన జయంతి ఉత్సవాలలో శునకాలకు అన్నదానం చేశారు. పలు రకాల ఆహార పదార్థాలను కావిడిలో పెట్టుకుని గ్రామంలో తిరుగుతూ కనిపించిన శునకాలకు విస్తరి వేసి వడ్డించారు.
ఆరవల్లిలో ఘనంగా వేమన శత జయంత్యుత్సవాలు
శునకాలకు అన్నదానం
Comments
Please login to add a commentAdd a comment