పారిశ్రామిక ప్రగతికి కృషి
ఏలూరు(మెట్రో): జిల్లాలో పారిశ్రామిక ప్రగతిలో 20 శాతం వృద్ధి రేటు సాధించేలా కృషి చేస్తున్నామని, పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన పారిశ్రామిక సమ్మిట్–2025 కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమల సంఖ్యకు 200 శాతానికి పైగా పెంచేలా అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుపై యువతకు అనుమతులు, రుణాలు, శిక్షణ, సాంకేతిక సహకారం వంటివి అందిస్తామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ ఆర్.విజయరాజు మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్ర చాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధి భాస్కర్ మాట్లాడారు. జిల్లాలో డ్వాక్రా రుణాల ద్వారా యూనిట్లు స్థాపించిన పలువురు మహిళలను కలెక్టర్ సన్మానించారు. జాబ్‌మేళాలో ఉద్యోగాలు సాధించిన యువతకు నియామక పత్రాలు అందించారు. గుడ్ హెల్త్ మిల్లెట్స్ ఫుడ్ బ్రాండ్ పేరుతో చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి తోట కృపామణిని కలెక్టర్ సన్మానించారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ఎల్‌డీఎం నీలాద్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment