నిర్వాసితులైన యువతకు న్యాయం చేయాలి
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తున్న తమకు పరిహారం విషయంలో అన్యాయం జరుగుతూనే ఉందని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. పరిహారం చెల్లింపులో భాగంగా అధికారులు ముంపు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ఇళ్ల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. సర్వే నోటిఫికేషన్ తేదికి ముందు మూడేళ్లుగా ముంపు ప్రాంతంపై జీవనోపాధి పొందుతున్న కుటుంబాలను ఆర్ అండ్ ఆర్ పరిహారానికి అర్హులుగా ప్రకటించింది. నోటిఫికేషన్ తేదికి కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన యువతను ప్రత్యేక కుటుంబంగా పరిగణించి వారికి కూడా ఆర్ అండ్ ఆర్ పరిహారం అందించేలా వివరాలు సేకరించారు. ఈ విషయంలో నోటిఫికేషన్ తేదికి వారం రోజులు వయసు తగ్గిన వారిని అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ విషయమై నిర్వాసితులు భూసేకరణాధికారి దృష్టికి తీసుకెళ్లినా చట్టం ప్రకారం ఇవ్వడం కుదరదనడంతో చేసేది లేక నిర్వాసితులు మిన్నకుండి పోయారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో 18 సంవత్సరాల వయసు నిండలేదని పరిగణలోకి తీసుకోని వారికి ఆర్ అండ్ ఆర్ పరిహారం చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు.
కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్టు?
భీమవరం: పట్టణంలో ఆక్వా వ్యాపారి కిడ్నాప్ కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు ఆదుపులోనికి తీసుకున్నట్లు తెలిసింది. పట్టణానికి చెందిన వి.సత్యనారాయణను టౌన్ రైల్వేస్టేషన్ వద్ద కొంతమంది కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అనంతపురం ప్రాంతానికి చెందిన కొంతమందికి దాదాపు రూ.5 కోట్ల వరకు బాకీ ఉండగా సక్రమంగా చెల్లించకపోవడం కిడ్నాపునకు కారణమని తెలుస్తోంది. 2020లో ముగ్గురు వ్యక్తులకు బాకీ పడిన సొమ్ముకు సంబంధించి సెటిల్‌మెంట్ చేసుకోగా ఒప్పందం మేరకు సొమ్ములు చెల్లించకపోవడంతో అనంతపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ద్వారా కిడ్నాప్ చేయించినట్లు తెలిసింది.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూటౌన్ సీఐ కాళీచరణ్ తన సిబ్బందితో విచారణ చేపట్టగా సీసీ పుటేజ్ ఆధారంగా కిడ్నాప్‌లో పాల్గొన్న 12 మందిలో ఏడుగురిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment