చెరువులకు మైకా బరకాలతో రక్షణ
భీమవరం: ఆక్వా సాగులో నష్టాలు చవిచూస్తున్న రైతులు ఖర్చు తగ్గించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల రొయ్యలకు తెగుళ్లు అధికం కావడంతో అనేకమంది రొయ్యల సాగును పక్కనపెట్టి చేపల సాగువైపు మక్కువ చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ఇటీవల రొయ్యల ధరలు కొంతమేరకు ఆశాజనకంగా ఉన్నా వైరస్ వంటి తెగుళ్లు పెరిగిపోయి తక్కువ కౌంట్‌లో పట్టుబడులు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా చేతికిరాక రొయ్యల రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రొయ్యల సాగులో ఖర్చు తగ్గించుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రొయ్యల చెరువులు నిత్యం నీటితో నిండుగా ఉండాలి. గట్టు లీకేజీ, వేసవికాలంలో నీరు ఆవిరి కావడంతో విద్యుత్ మోటార్లు, ఆయిల్ ఇంజిన్లు ఉపయోగించి నీరు తోడాల్సి ఉంటుంది. నీటి లీకేజీలు అరికట్టడానికి కొంతమంది రైతులు సరికొత్త పద్ధతిని అవలంభిస్తున్నారు. గట్ల చుట్టూ మైకా బరకాలు వేసి నీరు లీకేజీ లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. బరకాలు వేయడం వల్ల గట్లు కోతకు గురికాకుండా ఉపయోగపడతాయని చెబుతున్నారు. సముద్ర తీరప్రాంతం, ఇసుక ప్రాంతంలోని భూముల్లోని రొయ్యల చెరువులకు మైకా బరకాలు ఏర్పాట్లు ఎక్కువగా చేస్తున్నారు. మిగిలిన రైతులు కూడా చెరువు గట్ల చుట్టూ బరకాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment