మరోమారు భూముల సర్వే
ఏలూరు(మెట్రో): రైతులకు స్వచ్ఛమైన భూములను అప్పగించేందుకు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జగనన్న భూరక్ష పథకం ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి గత వైఎస్సార్‌సీపీ సర్కారు భూముల రీ సర్వే ప్రక్రియను ప్రారంభించింది. అయితే సర్వే ప్రక్రియ పూర్తి కావస్తున్న తరుణంలో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం రీ సర్వేను అర్ధాంతరంగా నిలిపివేసింది. అలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కక్షను వెళ్లగక్కింది. సర్వే పూర్తి చేసి హద్దులు గుర్తిస్తూ నాటిన సర్వే రాళ్లపై ఉన్న గత సీఎం జగన్ చిత్రాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇందుకోసం లక్షలాది రూపాయలు వెచ్చించింది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వంలో పూర్తిచేసిన రీ సర్వేనే మరోమారు చేపట్టేందుకు కూటమి ప్రభు త్వం తాజాగా చర్యలు తీసుకుంది. గతంలో గ్రా మాల వారీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వే పూర్తి చేశారు. దానిని కూటమి ప్రభుత్వం పూర్తిచేయడం మాని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేలా ఈనెల 20 నుంచి భూముల రీసర్వేకు చర్యలు చేపట్టింది. కేవలం జగన్‌మోహన్‌రెడ్డి సర్కారుపై ఉన్న అక్కసుతో పూర్తి చేసిన సర్వేను పక్కనపెట్టి గొప్పల కోసం మరోమారు సర్వే చేపడుతుందని రైతులు అంటున్నారు.
గత ప్రభుత్వంలో మూడు దశల్లో పక్కాగా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 664 రెవెన్యూ గ్రామాలు ఉండగా మూడు విడతల్లో 559 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తిచేశారు. అలాగే 252 గ్రామాల్లో పూర్తిస్థాయిలో హద్దులు గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. తొలి దశలో 82 గ్రామాల్లో 90,555 ఎకరాలు, రెండో దశలో 77 గ్రామాల్లో 87,018 ఎకరాలు, మూడో దశలో 77 గ్రామాల్లో 1,13,272 ఎకరాల్లో సర్వే నిర్వహించి రెవెన్యూ రికార్డులను సైతం మార్పు చేశారు. ఆయా భూముల్లో సర్వే రాళ్లు పాతి హద్దులు నిర్ణయించారు. రైతులకు హక్కు పత్రాలు సైతం అందజేశారు.
జిల్లావ్యాప్తంగా 50 బృందాలతో..
జిల్లాలోని జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు డివిజన్‌ల పరిధిలో సర్వేకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 10 బృందాలు 5,801.93 ఎకరాలు, ఏలూరు డివిజన్‌లో 26 బృందాలు 10,913.17 ఎకరాలు, నూజివీడు డివిజన్‌లో 14 బృందాలు 7,891.36 ఎకరాలు మొత్తంగా జి ల్లావ్యాప్తంగా 50 బృందాలు 24,606.46 ఎకరాలను సర్వే చేసేందుకు నిర్ణయించారు. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 7 మండలాల పరిధిలో 7 గ్రా మాలు, ఏలూరు డివిజన్‌లో పరిధిలో 11 మండలాల పరిధిలో 11 గ్రామాలు, నూజివీడు డివిజన్‌లో 6 మండలాల పరిధిలో 6 గ్రామాలు ప్రస్తుతం సర్వే చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.
జిల్లాలో ఇప్పటికే 252 గ్రామాల్లో పూర్తి
మళ్లీ సర్వేకు కూటమి ప్రభుత్వం చర్యలు
కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా
సర్వే సిబ్బందికి ముప్పుతిప్పలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 11.81 లక్షల ఎకరాల్లో పూర్తయిన సర్వే
గత ప్రభుత్వంలో రీ సర్వే ప్రక్రియ
రెవెన్యూ గ్రామాలు 664
డ్రోన్ సర్వే పూర్తయిన గ్రామాలు 559
సర్వే పూర్తయిన గ్రామాలు 252
డ్రోన్ సర్వే పూర్తయిన ఎకరాలు 11,81,565
స్వచ్ఛీకరణకు
సిద్ధంగా ఉన్న ఎకరాలు 3,34,518
స్వచ్ఛీకరణ పూర్తయిన గ్రామాలు 236
స్వచ్ఛీకరణ పూర్తయిన ఎకరాలు 2,90,845
20 నుంచి మండలానికి ఓ గ్రామంలో..
భూముల రీ సర్వేలో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని కూటమి సర్కారు చెబుతోంది. ఈనెల 20 నుంచి చేపట్టే సర్వే కార్యక్రమంలో 200 నుంచి 250 ఎకరాలకు ఒక బ్లాక్‌గా విభజించనున్నారు. ఆ బ్లాక్‌లకు ఒక బృందం ఏర్పాటు చేసి బృందంలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సహాయకుడు ఉంటారు. ఈ బృందానికి మరో సాంకేతిక సహాయకుడు సహాయాన్ని అందిస్తాడు. పొలాల గట్ల విస్తీర్ణాన్ని పక్కాగా కొలుస్తామని, ఎక్కడికక్కడ గ్రామ ప్రజలు భూ యజమానుల సమక్షంలో సర్వే చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment