స్వచ్ఛ నూజివీడుగా తీర్చిదిద్దాలి
నూజివీడు: మెరుగైన జీవనానికి స్వచ్ఛతపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి పట్టణాన్ని స్వచ్ఛ నూజివీడుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నూజివీడులో శని వారం ఆమె పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. మున్సిపల్ అధికారులకు సూచనలిచ్చారు. షాపుల యజమానులు, చిరువ్యాపారులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడానికి వీలులేదని అన్నారు. ప్రభుత్వం ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించిందని, ఈ మేరకు జిల్లాలో కార్యక్రమాలు చేపడతామన్నా రు. పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, జెడ్పీ సీఈఓ కె.సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ బీవీ సుబ్బారావు ఉన్నారు.
‘నవోదయ’ పరీక్షకు 1,455 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు 1,455 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని 13 కేంద్రాల్లో 3,148 మంది విద్యార్థులకు గాను 1,693 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి 3, పెదవేగి నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ 3, ప్రభుత్వ పరీక్ష అసిస్టెంట్ కమిషనర్ 2 కేంద్రాల్లో తనిఖీలు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
పరీక్షా పే చర్చతో జాతీయ సమైక్యత
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఢిల్లీలో ఈనెల 13వ తేదీన జరిగిన పరీక్షాపే చర్చ సదస్సులో జిల్లాలోని నిడమర్రు హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి పతివాడ రాకడ సువార్తరాజు పాల్గొన్నాడని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో సువార్త రాజు, సోషల్ టీచర్ కొల్లేపర కృష్ణ ప్రసాద్‌లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన పరీక్షాపే చర్చ సదస్సుకు రాష్ట్రం నుంచి 8 పాఠశాలల విద్యార్థులు ఎంపికయ్యారని, వారిలో ఏలూరు జిల్లా నుంచి సువార్త రాజు ఉన్నాడన్నారు. కార్యక్రమంలో శారీరక మానసిక అభివృద్ధిలో ఆహారం పాత్రం అనే అంశంపై చర్చా గోష్టి నిర్వహించారన్నారు. జాతీయ సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వ భావన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దో హదపడతాయన్నారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పంకజ్ కుమార్, ఎంఈఓ భాస్కర్ కుమార్, శ్రీనివాస్‌రావు, హెచ్ ఎం రాజేశ్వరి అభినందనలు తెలిపారు.
20న మెగా షుగర్ వైద్య శిబిరం
భీమవరం: యూకే–ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరాన్ని ఈనెల 20న భీమవరం డీఎన్నార్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఆవరణలో నిర్వహించనున్నట్టు దివంగత కేంద్ర మంత్రి కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తెలిపారు. శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ వేణు కవర్తపు (లండన్) ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం షుగర్ బాధితులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తామన్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి, డాక్టర్ పీఆర్‌కే వర్మ మాట్లాడుతూ పలు దేశాలకు చెందిన సుమారు 40 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలందింస్తారని, రోగులు ముందుగా సెల్ 96763 09926, 99893 42009, 94904 32934 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment