కొల్లేరు ప్రజల ఉపాధిని కాపాడాలి
ఏలూరు (టూటౌన్): కొల్లేరు ప్రజలకు నష్టం కల్గించే ఎకో సెన్సిటివ్ జోన్‌ను ఉపసంహరించుకోవాలని, పర్యావరణంతోపాటు కొల్లేరు ప్రజల ఉపాధి కాపాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా స్థాయి విస్తృత సమావేశం స్థానిక ఉద్దరాజు రామభవనంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కొల్లేరు సమస్యపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా మంతెన సీతారాం, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. రవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరులో ఉన్న ప్రస్తుత సమస్యలు పరిష్కరించడం మానేసి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని, మూడో కాంటూరు దేవుడెరుగు ఐదో కాంటూరు నుంచి పది కిలోమీటర్లకు సున్నిత పర్యావరణ ప్రదేశం పేరుతో 26 నిబంధనలను పెట్టి కొల్లేరు మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేసి పూర్తిగా అటవీ అధికారుల చేతుల్లో పెట్టబోతున్నారని విమర్శించారు. ఏలూరు జిల్లాలో కొల్లేటి ప్రాంతమైన నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, ఏలూరు, పెదపాడు, మండవల్లి, కై కలూరు, ఆకివీడు మండలాల్లోని 89 గ్రామాలపై ఈ ప్రభావం పడనుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి సున్నిత పర్యావరణ ప్రదేశం పేరుతో ఐదో కాంటూరు పైన పది కిలోమీటర్ల వరకు ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు చేయరాదని, కనీసం కట్టెల పొయ్యి కూడా వెలిగించడానికి వీలులేదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు మినహా ఆ పరిశ్రమల విస్తరించుకోవడానికి గాని కొత్త పరిశ్రమలు పెట్టడానికి గాని, భూగర్భ జలాలు వాడుకోవడానికి గాని ఎలాంటి అనుమతులు లేవని గుర్తు చేశారు. ఇలాంటి దారుణమైన 26 నిబంధనలను ప్రవేశపెట్టి కొల్లేరు చుట్టుపక్కల 89 గ్రామాల్లోని లక్షలాదిమంది ప్రజల పొట్ట కొట్టే నిర్ణయాన్ని తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఇటీవల జిల్లా అధికారులు మండల కేంద్రాల్లో సభలు నిర్వహించి తూతూ మంత్రంగా అభిప్రాయాలు సేకరించి నివేదికలు పంపించడం దారుణమన్నారు. తర్వాత గ్రామసభల నివేదిక ద్వారానే హద్దులు నిర్ణయిస్తామని చెప్తున్నారని, లైడార్ సర్వే జరుపుతున్నారు. అనంతరం గ్రామసభలు జరుపుతామని అధికారులు మాట మారుస్తున్నారన్నారు. తక్షణమే 89 గ్రామాల్లో గ్రామసభలు జరిపి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డీఎన్‌వీడీ ప్రసాద్, ఆర్.లింగరాజు, ఎం.నాగమణి, జి.రాజు, కె.శ్రీనివాస్, పి.రామకృష్ణ, వివిధ మండలాల నుంచి వచ్చిన సీపీఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర నేత మంతెన సీతారాం
Comments
Please login to add a commentAdd a comment