రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
కామవరపుకోట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రామచంద్రుడు గురువారం ప్రకటనలో తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. వీరిలో ఎంపికై న వారు విశాఖపట్నం జిల్లా అంకంపాలెంలో ఈనెల 25 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికల్లో సెక్రటరీ సీహెచ్ రాజు, ఆర్గనైజర్ శ్యామలాదేవి పాల్గొన్నారు.
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన తనయ
కామవరపుకోట: తండ్రికి తానే అన్నీ అయ్యి అంత్యక్రియలు నిర్వహించింది ఓ తనయ. వివరాల ప్రకారం.. కామవరపుకోట పంచాయతీ కొండగూడెంకు చెందిన కామా జయరాజు గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. జయరాజుకు ముగ్గురు కుమార్తెలు సంతానం. కొడుకులు లేకపోవడంతో పెద్ద కుమార్తె మంజూష అన్నీ తానే అయ్యి తన తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు.
గణతంత్ర వేడుకలకు సర్పంచ్
తాడేపల్లిగూడెం రూరల్ : భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం ఎంపికయ్యారు. జిల్లా నుంచి అన్నవరం ఒక్కరికే ఈ ఆహ్వానం అందడం విశేషం. పంచాయతీలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గణతంత్ర వేడుకల్లో అవార్డు అందుకోనున్నారు.
నేడు బాస్కెట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు
పెనుమంట్ర: మార్టేరులో ఎస్వీజీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పురుషుల జట్టు బాస్కెట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్రి కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2002, జనవరి 1 జన్మించిన క్రీడాకారులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 28 నుంచి విజయవాడలో జరిగే అంతర్‌జిల్లాల పోటీల్లో పాల్గొంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment