జీరో టిల్లేజ్‌తో మొక్కజొన్న సాగు మేలు
చింతలపూడి: జీరో టిల్లేజ్‌తో మొక్కజొన్న సాగు చేపట్టడం వల్ల అధిక లాభాలు పొందవచ్చునని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఖరీఫ్ వరికోతలు ముగియగానే దుక్కి దున్నకుండానే ఆరు తడి పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల రైతులకు ఖర్చు తగ్గడమే కాక, సమయం కూడా ఆదా అవుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేసుకోవడం వల్ల ఆదాయంతో పాటు నీటి వినియోగం తగ్గుతుంది. మెట్ట ప్రాంతంలో రైతులు వ్యవసాయశాఖ సూచనలు పాటించి ఈ విధానాన్ని పాటిస్తున్నారు.
జీరో టిల్లేజ్ వల్ల ప్రయోజనాలు
జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు వల్ల నేలను తయారు చేయడం, భూమిని దున్నుకోవడం వంటి సమస్యలు ఉండవు. సమయం వృథా కాదు. వరి పంట కోసిన తరువాత భూమి ఆరుదలకు వచ్చి తిరిగి దుక్కి దున్ని మొక్కజొన్న పంట విత్తుకోవడానికి 15–20 రోజులు పడుతుంది. దీనివల్ల మొక్కజొన్నకు సీజన్ దాటిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం దిగుబడిపై పడుతుంది. ఈ విధానంలో పై సమస్యలను అధిగమించవచ్చు. ఈ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలంటే రైతులు కోతలకు ముందు వరిపైరుకు ఆఖరి తడి ఇవ్వకుండా ఆపాలి. భూమిలో పంట మొలకెత్తడానికి అవసరమైన తేమ ఉంటే చాలు. ఒకవేళ తేమ ఆరిపోతే రైతులు తేలికపాటి తడి పెట్టుకోవాలి. తాడు సహాయంతో 45 సెంటీమీటర్ల లోతులో లైన్లలో విత్తనాలను పెట్టుకోవాలి. బరువు నేలలైతే వరసల మధ్య 60 సెంటీమీటర్లు, తేలికపాటి నేలలైతే 20 సెంటీమీటర్ల దూరం పాటించాలి. నేలను దున్నకుండా సాగుకు దిగడం వల్ల కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కలుపు నివారణకు 200 లీటర్ల నీటిలో 5.5 కేజీల అట్రాజిన్ పౌడర్, లేదా 200 లీటర్ల నీటిలో 500 మి.లీ ప్యారాకాట్ కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయడం వల్ల వరి కొనలు చిగుళ్లు రావు. గడ్డి మొలవకుండా ఉంటుంది. విత్తనం విత్తిన తరువాత ఒకవేళ కలుపు వస్తే ఇదే పధ్ధతి పాటించాలి.
ఎరువుల యాజమాన్యం
మొక్కజొన్న సాగుకు ఎకరాకు 96 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ అందించాలి. నత్రజనిని నాలుగు దఫాలు, పొటాష్‌ను రెండు దఫాలుగా పంటకు నీటి తడులు పెట్టే సమయంలో మొక్క మొదళ్లలో వేస్తే సరిపోతుంది. విత్తనాలు విత్తేటప్పుడు పక్కనే చిన్న రంధ్రం చేసి అందులో భాస్వరం, గుళికలు (డీఏపీ రూపంలో) వేసి కప్పాలి. మొక్కలు మొలిచిన 15–20 రోజులకు పైరుపై రెండు శాతం డీఏపీ ద్రావణాన్ని పిచికారీ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. వీటితో పాటు వ్యవసాయాధికారుల సూచనలు పాటించినట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చునని సహాయ వ్యవసాయ సంచాలకులు బి నాగకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment