అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
ఏలూరు టౌన్: ఏలూరు పాత బస్టాండ్‌లో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రక్తపుమడుగులో పడి ఉండడంతో తొలుత హత్యగా భావించినా అనారోగ్య కారణాలతోనే అతడు మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు టూటౌన్ ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలివి. ఏలూరులోని ఇజ్రాయేల్‌పేటకు చెందిన యశ్వంత్ దీపు (30) విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి నాలుగేళ్ల క్రితం ఓ యువతితో వివాహమైంది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విడిపోయారు. రెండేళ్ల క్రితం దీపు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన యఽశ్వంత్ దీపు అనారోగ్యం బారిన పడడంతో తీవ్ర మానసిక వ్యథకు గురవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం తనకు ఆరోగ్యం సరిగాలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తెలిపి వెళ్లిపోయాడు. రాత్రికి కూడా ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఏలూరు పాత బస్టాండ్‌లో గురువారం ఉదయం బస్టాండ్ స్వీపర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో కుర్చీల వెనుక ముఖంపై రక్తస్రావంతో ఓ వ్యక్తి పడి ఉండడాన్ని గుర్తించి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్ ఎస్సై రామకృష్ణ వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. నాలిక కర్చుకోవడంతో ముఖంపై రక్తస్రావం అయిందని ఒంటిపై ఇతర గాయాలు ఏమీ లేవని.. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment