క్లాప్‌ డ్రైవర్లపై కూటమి కత్తి | - | Sakshi
Sakshi News home page

క్లాప్‌ డ్రైవర్లపై కూటమి కత్తి

Published Thu, Feb 6 2025 2:13 AM | Last Updated on Thu, Feb 6 2025 2:12 AM

క్లాప

క్లాప్‌ డ్రైవర్లపై కూటమి కత్తి

ఏలూరు (టూటౌన్‌): కూటమి ప్రభుత్వం చిరుద్యోగులపైనా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. చెత్త సేకరణ నిర్వహిస్తున్న క్లాప్‌ ఆటో డ్రైవర్లను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 60 మంది క్లాప్‌ ఆటో డ్రైవర్లకు ఎటువంటి మందస్తు సమాచారం లేకుండా ఉద్వాసన పలికింది. మిగతా చోట్ల కూడా క్లాప్‌ ఆటో డ్రైవర్లను తొలగించేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై క్లాప్‌ ఆటో డైవ్రర్లు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు.

జిల్లాలో క్లాప్‌ ఆటోల వినియోగం ఇలా..

ఏలూరు కార్పొరేషన్‌లో 60 క్లాప్‌ ఆటోలు ఉండగా వీటి పరిధిలో మొత్తం 60 మంది ఆటో డ్రైవర్లు పనిచేస్తున్నారు. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలో మొత్తం 9 ఈ–ఆటోలు ఉన్నాయి. వీటిలో ఐదు మాత్రమే వినియోగంలో ఉండగా వీటి పరిధిలో 9 మంది కాంట్రాక్ట్‌ డ్రైవర్లను వినియోగిస్తున్నారు. తాజాగా ఐదుగురే విధుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. నూజివీడులో 6 ఈ–ఆటోలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో ఆరుగురు కాంట్రాక్ట్‌ డ్రైవర్లు పనిచేస్తున్నారు.

మూడురోజులుగా ఆందోళన

ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 60 మంది క్లాప్‌ ఆటో డ్రైవర్లను ఎటువంటి మందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించారు. దీంతో ఈ నెల ఒకటో తేదీనుంచి వారు రోడ్డున పడాల్సి వచ్చింది. ఇలా అర్ధాంతరంగా తమను విధుల నుంచి తొలగిస్తే తాము ఎలా బతకాలని క్లాప్‌ ఆటోల డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ డ్రైవర్లు గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం క్లాప్‌ ఆటోల డ్రైవర్లు స్థానిక పాత బస్టాండ్‌ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి కరవ్రంతెన, వసంత మహల్‌ సెంటర్‌, ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌, జిల్లా పరిషత్‌ సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

రాజకీయ దురుద్దేశంతోనే తొలగింపు

జిల్లాలో పనిచేస్తున్న క్లాప్‌ ఆటో డ్రైవర్లను రాజకీయ దురుద్దేశంతోనే విధుల నుంచి తొలగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 5,300 క్లాప్‌ ఆటోలను ప్రవేశ పెట్టారు. వీటి నిర్వహణ బాధ్యతను నాలుగు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. దీనిలో భాగంగా జిల్లాలో స్వయంభు అనే ఏజెన్సీ క్లాప్‌ ఆటోలను నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వైఎస్సార్‌ సీపీ కాంట్రాక్టర్లే లబ్ధి పొందుతున్నారనే అక్కసుతోనే పాతవారిని తొలగించేందుకు క్లాప్‌ ఆటోల సేవలను నిలుపుదల చేశారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తమ వారికి ఈ సేవలు కట్టబెట్టాలనే కుట్ర కోణం దీనిలో దాగి ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చిరుద్యోగులపై కక్ష

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆటోలకు పొగ

ఈనెల 1 నుంచి డ్రైవర్లను విధుల నుంచి తొలగింపు

ఏలూరు కార్పొరేషన్‌లో 60 మందికి ఉద్వాసన

మిగిలిన చోట్లా పక్కన పెట్టేందుకు కసరత్తు

చెత్త తరలించేవారు లేక ఎక్కడి వ్యర్థాలు అక్కడే..

రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి డ్రైవర్ల సన్నద్ధం

తక్షణం విధుల్లోకి తీసుకోవాలి

ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలోని క్లాప్‌ ఆటో డ్రైవర్లను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా క్లాప్‌ ఆటో డ్రైవర్లను విధుల నుంచి తొలగించడం దుర్మార్గం. తక్షణం విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలి. పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాల బకాయిలను చెల్లించాలి.

– బి.సోమయ్య, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏలూరు

ఉద్యోగ భద్రత కల్పించాలి

గత మూడున్నరేళ్ల నుంచి పనిచేస్తున్న తమను అకస్మాత్తుగా తొలగించడం అత్యంత దుర్మార్గం. మాకు ఉన్న ఒక్క ఆధారం పోతే మేము ఎలా బతకాలి. రెక్కాడితే గాని డెక్కాడని పరిస్థితి మాది. మాలాంటి చిరుద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం కనికరించాలి. తొలగించిన క్లాప్‌ ఆటో డ్రైవర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. మాకు ఉద్యోగ భధ్రత కల్పించాలి.

– ఎం.పుష్పరాజ్‌, క్లాప్‌ ఆటో డ్రైవర్‌,

ఏలూరు నగరపాలక సంస్థ

బకాయిలు చెల్లించక సేవలు నిలుపుదల

గతంలో వార్డు సచివాలయాల వారీగా చెత్త పన్ను సేకరించి వాటి నుంచి క్లాప్‌ ఆటోలు నిర్వహించే ఏజెన్సీలకు సొమ్ములను చెల్లించేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త పన్నును రద్దుచేయడంతో ఆ భారం కార్పొరేషన్‌, మున్సిపాల్టీలపై పడింది. దీంతో ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో చెత్త వాహనాలు నిలిచిపోవడంతో ఎక్కడి చెత్త అక్కడ దర్శనమిస్తోంది. ఒక పక్క పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా చెత్త వాహనాలను, సిబ్బందిని పెంపుదల చేయాల్సిన ప్రభుత్వం ఉన్నవాటి సేవలను నిలుపుదల చేయడం ఎంత వరకు సమంజసం అంటూ క్లాప్‌ ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
క్లాప్‌ డ్రైవర్లపై కూటమి కత్తి 1
1/3

క్లాప్‌ డ్రైవర్లపై కూటమి కత్తి

క్లాప్‌ డ్రైవర్లపై కూటమి కత్తి 2
2/3

క్లాప్‌ డ్రైవర్లపై కూటమి కత్తి

క్లాప్‌ డ్రైవర్లపై కూటమి కత్తి 3
3/3

క్లాప్‌ డ్రైవర్లపై కూటమి కత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement