71 శాతం మందిలో ఇదే బాధ ఒత్తిడి, చుండ్రు, శక్తిహీనత,
తదితర కారణాలు ట్రాయా సర్వేలో వెల్లడి
వేగంగా మారుతున్న లైఫ్ స్టైల్, మనం తినే ఆహారపు అలవాట్లు, నీరు, వాయు కాలుష్యం, ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల్లో ఒత్తిడి, నిద్రలేమి, చుండ్రు, పీసీఓఎస్, మాతృత్వం, ఇలా ఎన్నో కారణాల వల్ల పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఇటీవల ట్రాయా అనే సంస్థ చేట్టిన సర్వే ప్రకారం ప్రతి పది మందిలో ఏడెనిమిది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. ఆ వివరాలను పరిశీలిస్తే..
జుట్టు రాలడంపై ట్రాయా
సంస్థ దేశంలో మొత్తం 2.8 లక్షల మంది మహిళల అభిప్రాయాలు సేకరించింది. అందులో మొత్తం 71.19 శాతం మహిళలు జట్టు రాలిపోతుందని తెలిపారు. దీనికి గల కారణాలను, వారి అనుభవాలను సైతం పంచుకున్నారు. 36 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు గల మహిళల్లో 51 శాతం మంది ఈ సమస్యను అనుభవిస్తున్నామన్నారు. దాదాపు ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి కేశ సంపద పోతుందని తేలింది. అయితే మహిళలు జుట్టు రాలిపోవడంపై బహిరంగంగా మాట్లాడటానికి సిద్ధంగా లేరని సర్వేలో స్పష్టమైంది.
అనేక కారణాలు
కురులు రాలిపోవడానికి ప్రధానంగా పని ఒత్తిడి, ఆరోగ్యం పరంగా బలహీనంగా ఉండటం, హార్మోన్ హెచ్చుతగ్గులు వంటి కారణాలుగా కనిపిస్తున్నాయి. జుట్టు రాలిపోయే సమస్య ఉన్న మహిళల్లో ఏకంగా 88.6 శాతం మంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని స్పష్టమైంది. ఒత్తిడి, అధికంగా ఆందోళన వంటి అంశాలు జుట్టు రాలిపోవడానికి అధికంగా దోహదపడతాయని స్పష్టమయ్యింది. ఈ సమస్య ఎదుర్కొంటున్న వారిలో 48.14 శాతం స్త్రీలు నిద్రలేమితో బాధపడుతున్నారట. కురులు రాలిపోవడానికి చుండ్రు కారణమని 70 శాతం మంది చెబుతున్నారు. అంతే కాకుండా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు గల మహిళల్లో పీసీఓఎస్ హెచ్చుతగ్గులు కారణంగా కనిపిస్తోంది.
పరిష్కార దిశగా..
‘జుట్టు రాలడం అనేది ప్రధానంగా పురుషులు మాత్రమే ఎదుర్కొనే సమస్యగా కాదు. చాలా మంది మహిళలు శిరోజాలు రాలడాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సమస్యకు గల కారణాలను తెలుసుకోవడం, సమర్థవంతంగా పరిష్కరించడంలో మా అధ్యయనం సహాయపడాలన్నది లక్ష్యం.
– సలోనీఆనంద్, ట్రాయా సహ వ్యవస్థాపకురాలు
సరైన ఆహారం తీసుకోవాలి
జుట్టు రాలిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. పోషకాహర లేమి, హార్మోన్లలో మార్పులు, ఒత్తడితో జుట్టు రాలిపోతోంది. దీర్ఘకాలిక సమస్యలకు వాడే మందులూ దీనికి కారణమే. సరైన డైట్ పాటించి.. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం, పండ్లు తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి మంచిది.
– డాక్టర్ గంగా హరీశ్, డెర్మటాలజిస్టు
ఏ వయసు వారిలో ఎందుకు జుట్టు రాలిపోతోంది..
18 నుంచి 30 ఏళ్ల వయసు
వారిలో ఒత్తిడి, పీసీఓఎస్, చుండ్రు
31 నుంచి 40 ఏళ్లు వయసు
వారిలో ఒత్తిడి, పీసీఓఎస్,
ప్రసవానంతరం
40 ఏళ్లు పైబడిన వారిలో ఒత్తిడి, మోనోపాజ్, థైరాయిడ్
Comments
Please login to add a commentAdd a comment