తెల్లవారుజామున మూడున్నర కావస్తోంది. పక్కింటి బెడ్‌రూమ్‌లో పొగతో కూడిన మంటలు చూసి, విలియమ్ కంగారుగా ఫైర్ స్టేషన్ కి కాల్ చేశాడు. పావుగంటలో ఫైర్ ఇంజిన్ హారన్ ఆ కాలనీలో మారుమోగింది. ఆ మోత చుట్టూ ఉన్నవారిని నిద్రలేపింది. ఎవరికి ఏమైందోనన్న కంగారుతో ఇరుగుపొరుగూ పోగయ్యారు.
ఫైర్ స్టేషన్ అధికారులు తలుపులు పగలగొట్టి మరీ ఆ ఇంటి లోపలికి వెళ్లేసరికి బెడ్ మీద ఓ మహిళ అపస్మారకస్థితిలో మంటల్లో కాలిపోతోంది. వెంటనే మంటలార్పి, ఆమెను ఆసుపత్రికి తరలించారు.‘పేషెంట్ 80 శాతం వరకూ కాలిపోయింది. బతకడం కష్టం. మా ప్రయత్నం మేము చేస్తాం’ అన్నారు డాక్టర్లు. వెంటనే పోలీసులు ఆమె వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆమె పేరు లీన్ అమోస్, బ్యాంక్ ఫైనాన్షియల్ కన్సల్ట్టంట్‌గా పని చేస్తోంది. ప్రమాదం జరిగిన ఇంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు 38 ఏళ్లు.
కొంత సమయానికి లీన్ బాయ్ ఫ్రెండ్ ఎమిలీ స్మిత్‌తో సహా ఆమె పేరెంట్స్, బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. స్మిత్ ‘ఇది ప్రమాదం కాదు, ముమ్మాటికీ హత్యే! దీని వెనుక పెద్ద పెద్దవాళ్ల హస్తం ఉంది’ అని ఆరోపించాడు. లీన్ చాలా మంచి అమ్మాయి. తనని చంపాలనుకోవడం ఏమిటని అంతా నోళ్లు వెళ్లబెట్టారు. అయితే, స్మిత్ ఆరోపణలను పోలీసులు లెక్కలోకి తీసుకోలేదు. ఫార్మాలిటీ కోసం ప్రమాదం జరిగిన గదికి వెళ్లి తనిఖీలు చేశారు. కాలిపోయిన మంచానికి సమీపంలో ఒక సిగరెట్ పీక దొరికింది. పైగా అప్పటికే డాక్టర్లు లీన్ శరీరంలో అధిక మోతాదులో ఆల్కహాల్ ఉందని చెప్పడంతో ఓ ఊహాగానాన్ని అల్లేశారు.
బహుశా లీన్ మంచం మీద కూర్చుని పొగ తాగుతూ, మద్యం సేవిస్తూ రాత్రంతా గడిపి ఉంటుందని, మత్తులో మునిగిపోయి, నిప్పులు చెలరేగిన విషయం గుర్తించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని!దాంతో దాన్ని ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగానే నమోదు చేసుకున్నారు. అయితే లీన్‌కు సిగరెట్ అలవాటే లేదని ఆమె తల్లితో సహా ఆమె గురించి తెలిసినవారంతా వాదించినా, పోలీసులు పట్టించుకోలేదు.
స్మిత్ వాదనతో ప్రభావితమైన లీన్ కుటుంబం న్యాయపోరాటం మొదలుపెట్టింది.పదిరోజులు కొనఊపిరితో కొట్టుమిట్టాడిన లీన్, ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచింది. దాంతో లీన్ కుటుంబం నుంచి ఆందోళన ఉద్ధృతమైంది. ‘లీన్‌కు సిగరెట్ అలవాటు లేదంటుంటే మీరు నమ్మడం లేదు కాబట్టి, కావాలంటే ఆమె ఇంట్లో ఎక్కడైనా సిగరెట్ పెట్టెకాని, యాష్‌ట్రే కాని ఉందేమో కనిపెట్టండి. ఒకవేళ దొరికితే ఈ కేసును ఇక్కడితోనే వదిలేస్తాం’ అంటూ పోలీసులకు సవాలు విసిరారు.
అధికారులు ఇల్లంతా వెతికినా, ఎక్కడా లీన్‌కు సిగరెట్ అలవాటు ఉన్న ఆనవాళ్లు దొరకలేదు. పైగా బెడ్‌రూమ్‌లో ఒక మూలన కిరోసిన్, గ్యాసోలిన్ మిశ్రమం దొరికింది. మంటలు చెలరేగడానికి కారణమైన కిరోసిన్ మిశ్రమం లీన్ శరీరంపై ఉన్నట్లు పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో తేలింది. లీన్ మరణం హత్య కేసుగా మారింది. మరి లీన్‌ను చంపింది ఎవరు? ఆమె మీద అంత పగ ఎవరికి ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం అంతుచిక్కలేదు.ఈలోగా, స్మిత్ మరోసారి గొంతు విప్పాడు. ‘కొన్ని వారాల క్రితం లీన్ పని చేస్తున్న బ్యాంక్ చాలా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని, ఆ లిస్ట్ మొత్తం వెలికి తీస్తున్నానని చెప్పింది. అంటే ఆ బ్యాంక్ అక్రమార్కులే కుట్ర పన్ని లీన్‌ను చంపేసి ఉంటారు’ అని వాదించాడు. ఆ వాదనను లీన్ తల్లితో సహా స్నేహితులు కూడా నమ్మారు.
1995 డిసెంబర్ 11న వాషింగ్టన్, జార్జ్‌టౌన్‌లో లీన్ నివాసంలోనే ఈ సంఘటన జరిగింది. అదే ఏడాది ఆగస్ట్ నుంచి వాషింగ్టన్‌లో మెక్సికన్ బ్యాంకుల లావాదేవీలపై దృష్టిపెట్టిన లీన్, ‘నా దర్యాప్తు చాలా రహస్యంగా సాగుతోంది, కొన్ని విషయాలు ఇప్పుడే నీకు చెప్పడం మంచిదికాదు, ఇదంతా చాలా ప్రమాదకరమైన ఇన్వెస్టిగేషన్. ఇది బయటపడితే దేశం అట్టుడుకుతుంది’ అని తన స్నేహితుడు స్మిత్‌తో చెప్పిందట! అలా చెప్పిన కొన్ని వారాలకే ఆమెపై దాడి జరిగింది.
ఇంట్లో ఎక్కడా ఆమె దర్యాప్తుకు సంబంధించిన పేపర్స్ కూడా లేవు. అంటే వాటిని ఎవరో దొంగలించి ఉంటారనే స్మిత్ నమ్మకం. అయితే ఇంట్లోకి కిల్లర్ బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేకపోవడంతో కిల్లర్ లీన్‌కు సుపరిచితుడేనని అంచనాకొచ్చారు అధికారులు. ఎక్కువగా మద్యం తాగించి అపస్మారకస్థితికి చేర్చాకే ఆమె బెడ్‌పై కిరోసిన్ మిశ్రమాన్ని చల్లి, నిప్పు అంటించి పారిపోయినట్లు స్పష్టత వచ్చింది. కానీ హంతకుడు ఎవరో తెలియకపోవడంతో లీన్ మరణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment