ఈ రాశి వారికి ఈ ఉగాది నూతన సంవత్సరంతో ఫలితం ఎలా ఉందంటే? | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి ఈ ఉగాది నూతన సంవత్సరంతో ఫలితం ఎలా ఉందంటే?

Published Sun, Apr 7 2024 11:17 AM

Ugadi Panchangam 2024 - Sakshi

వృశ్చిక రాశి

ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–5.
విశాఖ 4 వ పాదము (తొ)
అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)
జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)

గురువు మే 1 వరకు మేషం (షష్ఠం)లోను తదుపరి వృషభం (సప్తమం)లోను సంచరిస్తారు. శని కుంభం (చతుర్థం)లోను రాహువు మీనం (పంచమం)లోను కేతువు (లాభం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సమయపాలన సరిగా ఉండదు. పైన చెప్పిన నాలుగు గ్రహాల సంచారం సరిగాలేదు. అయితే ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండటం వల్ల మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలరు. పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ వస్తువులు చౌర్యానికి గురి కావడం, లేదా మీరే వాటిని ఎక్కడైనా మరచిపోవడం జరుగుతుంది. అప్రయత్నంగా శుభకార్యాలలో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి ఉంటాయి. ఉద్యోగ విషయాలలో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతుంటుంది.

 మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థానచలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు. అయితే విచిత్రం ఏమిటంటే వృత్తి రీత్యా ఈ సంవత్సరం మే నుంచి గురువు వలన రక్షణ బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువ, కానీ నష్టం ఉండదు. నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకొని, ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు దారి తీస్తాయి. అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయితో ఉంటాయి. అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు. కానీ మీ ప్రవర్తన అనుకూలంగా ఉండదు. తరచూ శరీరం బరువు తగ్గే అవకాశాలు వున్నాయి. 

ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే అయినా, డబ్బు లేదని ఏ పనీ ఆగదు. గతం కంటే రాబడి తగ్గుతుంది. కానీ ఇబ్బంది కాదు. అనవసర ఖర్చులను నియంత్రిస్తారు. తరచుగా అధికారులు, బంధువులూ, పూజ్యుల రాకపోకలు దృష్ట్యా ధనవ్యయం అవుతుంది. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలం కాదు. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు పాటించాలి. పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య సదుపాయాల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో ప్రతి పనీ మీరే స్వయంగా చూసుకోండి. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. 

గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని సూచన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. షేర్‌ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము నడుస్తున్నది అనే చెప్పాలి. దూకుడువద్దు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసర సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి. వాయిదా వేయండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు అందవు. నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది.

విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు. సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కావు. పనులు ఆలస్యమవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. 

శాంతి మార్గం: శని, గురు, రాహువులకు శాంతి చేయించండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ ధ్యానం చేయండి. రోజూ గోపూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

ఏప్రిల్‌: ఉద్యోగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. సంతానంతో అభిప్రాయ భేదాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు, షేర్‌ వ్యాపారులకు అనుకూలం. తరచు శుభవార్తలు వింటారు. 

మే: ఈనెల ప్రతికూలత ఎక్కువ. నిందలు పడవలసి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. నవగ్రహ శాంతి మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్‌ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు అనుకూలం విదేశీ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. స్థిరాస్తి, కోర్టు విషయాలు బాగా అనుకూలం. 

జూన్‌: తెలియని ఆందోళన ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది. ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి అందరి నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. షేర్‌ వ్యాపారులకు, రైతులకు అనుకూలం. 

జులై: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నత అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి చేసే పనులు విజయవంతం అవుతాయి. మొదటి రెండు వారాలలో మంచి ఫలితాలు అందుతాయి. షేర్‌ వ్యాపారులకు లాభాలు తక్కువ. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. 

ఆగస్ట్‌: ఉద్యోగంలో మార్పులు. ఉన్నత పదవులు చేపడతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య, ఋణ సమస్యలు పెరుగుతాయి. కుజ శాంతి చేయాలి. సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు పెరుగుతాయి. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. రైతులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. 

సెప్టెంబర్‌: రాజకీయవేత్తలకు అనుకూలం. ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యాపారలబ్ధి. బదిలీలు అనుకూలం. ప్రయాణ లాభం. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. శుభపరిణామాలు కనిపిస్తాయి. కుజశాంతి మంచిది. రాబోవు ఆరు మాసాలు ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతుంటాయి. విదేశీ ప్రయత్నాలు షేర్‌ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు. 

అక్టోబర్‌: ఈనెల అనుకూలత తక్కువ.  శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు తగిన ఖర్చులు ఉంటాయి. అవసరాలకు తగిన ఆదాయం అందదు. వృత్తి ఉద్యోగాల్లోను, ఆరోగ్యంపైన జాగ్రత్త అవసరం. షేర్‌ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. 

నవంబర్‌: ఈనెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. వ్యాపారం మందగిస్తుంది. కొత్త పనులు ఆలస్యమవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. నిరుత్సాçహానికి లోనవుతారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. 

డిసెంబర్‌: కుటుంబ, ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. స్థానచలనానికి ప్రయత్నిస్తారు. పనులు ముందుకు సాగవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఋణ సమస్యలు పెరుగుతాయి. విష్ణు ఆరా ధన శ్రేయస్కరం. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు భయం కలిగిస్తాయి. షేర్‌ వ్యాపారులు, విద్యార్థులు రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. 

జనవరి: ఎప్పటి నుంచో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి. బదిలీలు అనుకూలం. భోజన సౌఖ్యం. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారం లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తారు. విష్ణు ఆరాధన మంచిది. అనురాధ నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. షేర్‌ వ్యాపారులు సరిగా వ్యాపారం చేయలేరు. ప్రతి విషయంలోనూ గోప్యత పాటించడం మంచిది. విద్యార్థులు, రైతులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఫిబ్రవరి: రవి–కుజ–బుధుల సంచారం ప్రతికూలముగా ఉన్నది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పనులలో ఆలస్యం, కుటుంబ ఖర్చులు పెరగటం, శారీరక శ్రమ అధికమవడం జరుగుతాయి. పెద్దల, గురువుల సహకారంతో పనులు పూరవుతాయి. 

సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. నవగ్రహారాధన చేయడం మంచిది. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ ఇతరుల సలహాలు స్వీకరింపవద్దు. ప్రతి పనీ స్వయంగా చూసుకోవాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. పెద్దలకు, పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. షేర్‌ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలుంటాయి. మార్చి: ఈనెల గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఇతరులతో కొంత మితంగా వ్యవహరించుట మంచిది. వ్యర్థప్రసంగాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పనులు ఆలస్యమవుతాయి. ఉద్యోగంలో తోటివారితోను, అధికారులతోను విభేదాలు పెరుగును. పెద్దల సహాయం లభిస్తుంది. దైవారాధన మానవద్దు.

Advertisement
Advertisement