సీతమ్మ మనసు ఆమె దగ్గర లేదు. రాముడి దగ్గర ఉంది. రాముడి మనసు ఆయన దగ్గర లేదు. సీతమ్మ దగ్గర ఉంది. అందుకే ఇద్దరూ అలా కలిసి ఉండగలిగారు’ అంటాడు హనుమ రామాయణంలో. ఎలా కలిసి ఉన్నాం.. అన్నదాని కన్నా, ఎంతకాలం కలిసి ఉన్నాం.. అన్న దాని కన్నా, ఎంతగా మనసులు ఒక్కటిగా చేసుకుని బతికామన్నది దాంపత్యంలో ప్రధానం.ఒకప్పుడు కంచి మహాస్వామి తీర్థం ఇస్తున్నారు. భక్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే ఆయన సందర్భాన్ని బట్టి అనుగ్రహిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు తీర్థమిస్తూ ఒక ముసలామెను ‘ఏమమ్మా, ఏమిటి చెప్పు’ అన్నారు. ‘నాకన్నా ముందు నా భర్తగారు పోయేటట్లు ఆశీర్వదించండి’ అన్నది. ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోతూ ఎందుకలా! అనడిగారు.
‘‘స్వామీ! ఏమని చెప్పను. ఆయనది పసిపిల్లవాడి చాపల్యం. మూర్ఖత్వం. ఏదీ తెలియని అమాయకత్వం. నేనున్నంతకాలం ఆయనకు ఏ లోటూ లేదు. రానీయను కూడా. ఇద్దరికీ వయసయిపోయింది. ఆరోగ్యం కుదురుగ్గా ఉండడం లేదు. నేను ముందుపోతే తరువాత ఆయన పరిస్థితి ఏమిటా అన్నదే నా దిగులు. ముందు ఆయన వెళ్ళిపోతే నేనెలాగూ వదిలి ఉండలేను. వెనకే నేనూ పోతా. అందుకని ముందు ఆయన పోయేట్టు అనుగ్రహించండి’ అని వేడుకుంది.
అంతటి మహాస్వామికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. అందరివంకా చూసి ఇదీ భారతీయ దాంపత్యం.. అన్నారు. ఎంత తప్పు చేసినా ఉద్ధరించుకోవడమే తప్ప చేయి వదిలిపెట్టడం అనే మాట అన్వయం కాని ధర్మం ఇది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం – అహల్య ఉ΄ాఖ్యానం. భార్య దోషమే చేసిందని తెలిసినా ఆ దోషం చేయడానికి కారణమయిన మానసిక ఉద్వేగాలను దూరంగా ఉంచుకుని..‘‘...వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ..’’ నువ్వు తపస్సు చేత పవిత్రమై, మళ్ళీ నా పక్కన స్థానాన్ని ΄పోదు. పునీతవు కా..’’ అని అహల్యను ఉద్ధరించుకున్నాడు తప్ప ఆమెను విడిచిపెట్టేస్తున్నా.. అన్న మాట మాత్రం గౌతమ మహర్షి అనలేదు. అదీ గృహస్థాశ్రమ వైశిష్ఠ్యం. ఇటువంటి ధర్మానికి రెండు చేతులెత్తి నమస్కారం చేయాలి.
వివాహం అయిపోయిన తరువాత ప్రదానం చేసేటప్పుడు భర్త భార్యతో ‘‘నువ్వు నన్ను నీ పదవ కుమారుడిగా చేసుకుంటావా?’’ అని అడుగుతాడు. భర్త పదవ కుమారుడు ఎట్లా అవుతాడు? మలి వయసులో శరీరం పట్టు తప్పుతుంటుంది. పెంకితనం ఏర్పడుతుంది. అహం పెరుగుతుంది. అప్పుడు నీ పిల్లలను చూసినట్లు నన్ను చూస్తావా... అని అడుగుతాడు.
రామాయణంలో సీతమ్మ .. ‘‘ఇక్కడ రాజ్ర΄ాసాదంలో ఎన్ని సుఖాలయినా ఉండనీయవయ్యా రామా, నన్ను అరణ్యవాసానికి వద్దంటావేమిటి ! ..’’ అంటూ ‘‘నాతంత్రీ వాద్యతే వీణా, నా చక్రో వర్తతే రథః / నా పతిః సుఖమేధేత యా స్యాదపి శతాత్మజా...’’ అంటుంది. నా కొడుకులు నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నా, నువ్వు లేని నాడు నాకు తృప్తిలేదు. అది అరణ్యమయినా నువ్వున్న చోటే నా చోటు..’’ అంటుంది. ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం అంత గొప్పది. దానికి కారణం ప్రేమ ఒక్కటే కాదు. అంతర్లీనంగా ధర్మం ఉంటుంది. దానిలో దంపతులు తరించి పోతారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment