క్లోయీ ఝావో (నోమాడ్‌ల్యాండ్); ఎమరాల్డ్ ఫెనెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమన్)
ఆస్కార్ చరిత్రలోనే తొలిసారి ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఒకే ఏడాది ఇద్దరు మహిళలు నామినేట్ అయ్యారు! ‘నో మాడ్‌ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’.. అనే చిత్రాలకు దర్శకత్వం వహించిన క్లోయీ జావో, ఎమరాల్డ్ ఫెనెల్.. ఇద్దరూ నలభై ఏళ్ల లోపు వారే.
ఈ మార్చి 31 న క్లోయీ ఝావో జరుపుకునే తన 39వ జన్మదినం తప్పనిసరిగా ప్రత్యేకమైనదై ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతోపాటు ఈసారి ఆమెకు ఆస్కార్ ఆకాంక్షలు తెలిపేవారూ ఉంటారు. ఆమె దర్శకత్వం వహించిన అమెరికన్ డ్రామా ఫిల్మ్ ‘నోమాడ్‌ల్యాండ్’ కు ఆరు నామినేషన్‌లు దక్కడం ఆ ఆకాంక్షలకు ఒక కారణం అయితే, వాటిల్లో సగానికి సగం.. ‘బెస్ట్ డైరెక్టర్’, ‘బెస్ట్ ఆడాప్టెడ్ స్క్రీన్‌ప్లే’, ‘బెస్ట్ ఫిల్మిం ఎడిటింగ్’ కేటగిరీలలో క్లోయీ ఝావో నామినేషన్ పొందడం మరొక విశేషం.
ఇప్పటివరకు ఆమె దర్శకత్వం వహించింది మూడంటే మూడే సినిమాలు అయినా.. వచ్చిన అవార్డులు, పొందిన నామినేషన్‌లు ముప్పైమూడు! తొలి సినిమా ‘సాంగ్స్ మై బ్రదర్స్ టాట్ మి’ (2015), రెండో సినిమా ‘ది రైడర్’ (2017), మూడోది ఇప్పుడీ ‘నోమాడ్‌ల్యాండ్’ (2020). ఝావో చైనా మహిళ. జడను ముందుకు వేసుకుంటే సుమారుగా మన ఇండియన్‌లా ఉంటారు. ఉండటం అమెరికాలో. బి.ఎ. చదివిందీ, ఎం.ఎఫ్.ఎ. చేసిందీ అమెరికాలోనే. సినిమాలు తియ్యాలన్న అభిలాష తల్లిదండ్రులనుంచేమీ ఆమెకు రాలేదు. తండ్రి బీజింగ్‌లోని ఒక స్టీల్ ప్లాంట్‌లో మేనేజర్. తల్లి హాస్పిటల్ లో వర్కర్. ఝావో కొంచెం దూకుడు. స్కూల్లో సోమరి. తనే ఆ మాట చెప్పుకుంటారు.
క్లాస్ రూమ్‌లో జపాన్ వాళ్ల ‘మాంగా’ గ్రాఫిక్ నవలల్ని బుక్స్ మధ్యలో పెట్టుకుని లీనమైపోయి చదివారు. అవి బుర్రలో పని చేస్తున్నప్పుడు తనూ కొన్ని కాల్పనిక పాత్రల్ని సృష్టించారు. ఇలాంటి వాళ్లకు సినిమాలు నచ్చుతాయి. ఝావో తన టీనేజ్‌లో విపరీతంగా సినిమాలు చూశారు. కూతురు మాట వినడం లేదని, తనకు అస్సలు ఇంగ్లిష్ తెలియకపోయినా పేరెంట్స్ ఆమెను లండన్ తీసుకెళ్లి అక్కడో బోర్డింగ్ స్కూల్లో చేర్చి వచ్చారు. తల్లిదండ్రుల ఇష్టం లండన్. తన ఇష్టం లాస్ ఏంజెలిస్. హై స్కూల్ చదువు కోసం లాస్ ఏంజెలిస్ వెళ్లిపోయి, అక్కడే ఉండిపోయారు ఝావో. మొదటి సినిమా తీసేటప్పటికి ఆమె వయసు 33. ప్రస్తుతానికి ఆమె జీవిత భాగస్వామి సినిమాలే. సినిమాలు చూడటం, సినిమాలు తీయడం. సినిమాకు ఎన్ని ఫ్రేములైతే ఉంటాయో, రోజుకు అన్ని గంటలపాటు సినిమాలకు పని చెయ్యడం! క్లోయీ ఝావోకు నామినేషన్ దక్కడంతో ఆస్కార్ చరిత్రలో ‘బెస్ట్ ౖyð రెక్టర్’గా నామినేట్ అయిన తొలి ఆసియా మహిళగా గుర్తింపు పొందారు.
∙∙
ఎమరాల్డ్ ఫెనెల్.. ఝావో కన్నా నాలుగేళ్లు చిన్న. బొద్దుగా, ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్‌లా ఉంటారు. ఎప్పుడూ పుస్తకాలు చదువుతుంటారు. బ్రిటన్ మహిళ. నటి, రచయిత్రి, దర్శకురాలు. ఝావో ‘నోమాడ్‌ల్యాండ్’తోపాటు ఫెనెల్ దర్శకత్వం వహించిన ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ చిత్రం కూడా ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ యాక్ట్రెస్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే’, ‘బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్’ కేటగిరీలకు కూడా ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ నామినేట్ అయింది. ఝావోలా ఫెనెల్ కూడా మూడు నామినేషన్‌లు పొందారు. బెస్ట్ డైరెక్టర్‌తోపాటు.. ‘బెస్ట్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ పే’్ల కేటగిరీల్లో ఆమెకు చోటు లభించింది. ఫెనెల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రానికే నామినేషన్ దక్కడం ఒక విధంగా అవార్డు రావడమే.
నోమాడ్‌ల్యాండ్, ప్రామిసింగ్ యంగ్ ఉమన్
ఫెనెల్ ప్రధానంగా నటి. 2010 నుంచీ ఆమె సినిమాల్లో నటిస్తున్నారు. లండన్‌లో పుట్టారు. ఆక్స్‌ఫర్డ్‌లో బి.ఎ. చదివారు. తర్వాత సిట్‌కామ్ (సిట్యువేషనల్ కామెడీ) షోలలోకి వెళ్లారు. సినిమా కథలు, స్క్రిప్టులు రాశారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఈ రెండు చిత్రాలు.. నోమాడ్‌ల్యాండ్’, ‘ప్రామిసింగ్ యంగ్ ఉమన్’ల కథాంశం కూడా మహిళలదే కావడం యాదృచ్చికమే. తన అరవైలలో ఉన్న మహిళ ‘గ్రేట్ రిసెషన్’ కాలంలో సర్వం కోల్పోయి వ్యాన్‌లో దేశ దిమ్మరిగా గడపడం నోమాడ్ ల్యాండ్ స్టోరీ అయితే.. జీవితంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చిన ఒక మహిళ కథ ప్రామిసింగ్ యంగ్ ఉమన్. ఈ రెండు చిత్రాలలో ఏ చిత్ర దర్శకురాలికి ఆస్కార్ వచ్చినా.. వారు ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరీలో ఆస్కార్ పొందిన రెండో మహిళ అవుతారు. మొదటి మహిళ క్యాథ్రిన్ బెగెలో. 2010లో ‘హర్ట్ లాకర్’ అనే చిత్రానికి ఆమెకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది.
నామినేషన్‌కే 48 ఏళ్లు పట్టింది!
తొంభై ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు (క్లోయీ, ఫెనెల్ లను మినహాయించి) ఐదుగురు మహిళలు మాత్రమే బెస్ట్ ౖyð రెక్టర్‌లుగా నామినేట్ అయ్యారు. 1976లో లీనా వెర్ట్‌మ్యూలర్ (సెవెన్ బ్యూటీస్), 1993లో జేన్ క్యాంపియన్ (ది పియానో), 2003లో సోఫియా కొప్పోలా (లాస్ట్ ఇన్ ట్రాన్స్‌లేషన్), 2010లో క్యాథ్రీన్ బిగెలో (ది హర్ట్ లాకర్), 2017లో గ్రెటా గెర్విగ్ (లేడీ బర్డ్) నామినేట్ అవగా.. క్యాథ్రీన్ బిగెలోకు అవార్డు వచ్చింది. ఇక బెస్ట్ డైరెక్టర్‌గా ఒక మహిళ ఆస్కార్‌కు నామినేట్ అవడానికైతే 48 ఏళ్లు పట్టింది.
ఆస్కార్ తొలి మహిళా ‘బెస్ట్ డైరెక్టర్’ క్యాథ్రీన్ బిగెలో.
Comments
Please login to add a commentAdd a comment