ఇటీవల దేశంలోని పదిహేను ప్రతిపక్ష పార్టీలు పట్నాలో సమావేశమై, రానున్న ఎన్నికల్లో అధికార బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ లేదా కాంగ్రెసేతర పక్షాలతో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడే అవకాశాలు దాదాపుగా లేవు.
‘సహజ నేత’ విషయంలో పట్టుబట్టబోమని ఇప్పటికే కాంగ్రెస్ సూచనప్రాయంగా స్పష్టం చేసింది. అయితే అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు నమ్మదగ్గ సైద్ధాంతిక ఆలోచన మాత్రం ప్రతిపక్షాల వద్ద కరవైంది. పరిపాలన విషయంలోనూ ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సి ఉంటుంది. బలమైన ప్రత్యర్థిగా ఎదగాలంటే భాగస్వామ్య పక్షాలన్నీ తమ బలాలు, బలహీనతలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
బిహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన పదిహేను ప్రతిపక్ష పార్టీల సమావేశానికి వర్త మాన రాజకీయ పరిస్థితుల్లో ప్రాముఖ్యత ఏర్పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాన్ని పక్కనపెడతే, ప్రతిపక్షాల సమావేశం సరైన దిశలోనే సాగిందని చెప్పాలి. అలాగే ఈ సమావేశంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో రాజకీయ అవగాహన, పొత్తు ఉండే అవకాశాలూ సన్నగిల్లాయి.
అయితే పట్నా మీటింగ్‌తో మూడు విషయాలైతే స్పష్టమయ్యాయి. మొదటిది... సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ లేదా కాంగ్రెసేతర పక్షాలతో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడే అవకాశాలు దాదాపుగా లేవు. ప్రతిపక్ష కూటమి ఏదైనా ఏర్పడాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంగానే జరగాలి. అప్పుడే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమితో ధీటైన పోటీ సాధ్యం. రానున్న కొన్ని నెలల్లో రాజ కీయ శక్తుల పునరేకీకరణ జరగనుంది.
రెండోది... పట్నా సమావేశానికి హాజరు కాని పార్టీలు ఒక దగ్గర చేరే అవకాశాలు లేకపోవడం. తెలుగుదేశం, అకాలీదళ్, ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం వంటివి బీజేపీ వైపు మొగ్గుతూంటే... వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ ఏ కూటమిలోనూ చేరే అవకా శాలు లేవు. భారత రాష్ట్ర సమితి కూడా ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ తాము ఏ పక్షమన్నది స్పష్టం చేయకపోవచ్చు.
ప్రతిపక్ష కూటమి తమ భాగస్వాముల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి బహుజన్ సమాజ్ మంచి ఉదాహరణ. ప్రతిపక్ష కూటమిలో చేరతామంటూనే గతంలో ఈ పార్టీ పార్లమెంటులో బీజేపీకి మద్దతిచ్చిన విషయం ప్రస్తావనార్హం.మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో బీఎస్పీ మద్దతును కాంగ్రెస్ ఆశిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ 2018లో బీఎస్పీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలుపొందింది. ఆమ్ ఆద్మీ పార్టీ సంగతి ఏమిటన్నది కూడా ప్రతిపక్ష కూటమి నిర్ణయించుకోవాలి.
ముచ్చటగా మూడో అంశం... భాగస్వాముల విషయంలో కాంగ్రెస్ గతం కంటే ఎక్కువగా కొంత పట్టువిడుపుల ధోరణితో వ్యవహరిస్తుందనేందుకు కొన్ని తార్కాణాలు కనిపిస్తున్నాయి. ‘సహజ నేత’ విషయంలో పట్టుబట్టబోమని ఇప్పటికే కాంగ్రెస్ సూచన ప్రాయంగా స్పష్టం చేసింది. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఒత్తిడికి గురి చేసి లోకసభ స్థానాలు తక్కువగా కేటాయించినా ఆ పార్టీ ఇదే విషయానికి కట్టబడి ఉంటుందా అన్నది చూడాలి.
బీజేపీని ఎదుర్కొనే విషయంలో ఇంకా ఏమేం చేయాలన్న విషయంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు జూలై నెలలో సిమ్లాలో మరోసారి సమావేశం కానున్నాయి. బహుశా ఈ కూటమి తమ బలాలు, బలహీనతలు, అవకాశాలు, భయాల విశ్లేషణ (స్వాట్ అనాలసిస్) చేసుకుంటుందేమో!
బలాలు: కూటమి ఒక రూపం సంతరించుకుంటే మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలోని సామాజిక సమీకరణలు కచ్చితంగా బీజేపీని దెబ్బతీయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఎంతమేరకన్నది ప్రస్తుతానికి అస్పష్టం. 2019లో ఉత్తర ప్రదేశ్‌లో జరిగనట్లుగానే చాలా స్వల్పమైన మార్పే ఉండవచ్చు.
మూడేళ్ల క్రితం అక్కడ సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు రెండూ జట్టు కట్టినా అట్టడుగు స్థాయిలోని వైరుద్ధ్యం తగిన లాభాలు ఇవ్వలేక పోయింది. బీజేపీ వేసిన సామాజిక సమీకరణలు, ప్రధాని నరేంద్ర మోదీ పలుకుబడి ముందు నిలవలేకపోయాయి. ఒక్కటైతే వాస్తవం. ప్రతిపక్షాలు విడివిడిగా కంటే ఉమ్మడిగా పోటీచేస్తేనే బీజేపీకి ధీటైన సవాలు విసరగలవు.
బలహీనతలు: ‘మోదీ హఠావో’ వంటి ఊకదంపుడు పిలుపులతో ప్రయోజనం ఉండదు. అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు నమ్మదగ్గ సైద్ధాంతిక ఆలోచన ప్రతిపక్షాల వద్ద కరవైంది. పరిపాలన విషయంలోనూ ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య విలువల పతనం, క్రోనీ కేపిటలిజమ్ అంటూ ఎంత గోలపెట్టినా వచ్చే లాభం అంతంతే.
ఇదే సమయంలో దేశాద్యంతం మోదీ మాదిరిగా అందరినీ మెప్పించగల నాయకుడు కూడా ప్రతిపక్ష కూటమిలో కని పించరు. ఇది ఒకరకమైన విచిత్రమైన పరిస్థితి కల్పిస్తుంది. కూటమి తరఫున ఒక నేతను ప్రతిపాదిస్తే, అధ్యక్ష తరహా ఎన్నికల రూపు సంతరించుకుంటుంది. గతంలో ఇది బీజేపీకి లాభం చేకూర్చింది. పేరు చెప్పకుండానే ఎన్నికలకు వెళితే బీజేపీ కాస్తా ప్రతిపక్ష కూటమి అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆరోపించవచ్చు.
వచ్చే ఎన్ని కలు వారసత్వ రాజకీయాలకూ, ఈ దేశపు మట్టి మనిషికీ మధ్య జరిగేవని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రతిపక్ష కూటమి ఏర్పాటును తక్కువ చేసే ప్రయత్నం చేశారు. మోదీ ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. వచ్చే ఎన్నికలు కష్టపడి రోజంతా పనిచేసే రాజకీయ నేతకూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికీ మధ్య జరిగేవన్నారు.
అవకాశాలు: గత పన్నెండు నెలల్లో జరిగిన అనేక ఒపీనియన్ పోల్స్, సర్వేలు దేశంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్న విష యాన్ని స్పష్టం చేశాయి. చాలామంది భారతీయులు అర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. 2019, 2014లలో బీజేపీ వెంట నిలిచిన యువ ఓటర్లు ఇప్పుడు అంత ప్రేమగా ఏమీ లేరు. 2022లో జరిగిన ‘ది ఆక్సిస్–మై ఇండియా’ ఎగ్జిట్ పోల్‌లో 18 – 25 ఏళ్ల వారు వేసిన ఓట్లలో బీజేపీ, ఎస్పీల మధ్య అంతరం ఒక్క శాతమే. 25 ఏళ్ల పైబడ్డ వారిలో రెండు పార్టీల మధ్య అంతరం ఎక్కువ.
ఈ ఏడాది ‘ఇండియా టుడే, సీ ఓటర్’ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలోనూ చాలామంది ఉద్యోగాల విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తి 18–34 మధ్య వయస్కుల్లో ఎక్కువగా ఉండటం గమ నార్హం. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల పనితీరు అంత గొప్పగా ఏమీ లేదు. 2014 నుంచి ఇప్పటి వరకూ 57సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ 29 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఇటీవలి కర్ణాటక ఎన్నికలు మారుతున్న పరిస్థితు లకు ప్రబల తార్కాణం. వీటి వల్లనే ప్రతిపక్షాలు రానున్న ఎన్నికలను వీలైనంత వరకూ స్థానికాంశాలపై జరిగేలా చూడాల్సి ఉంటుంది.
ముప్పు: 2024 లోక్‌సభ ఎన్నికలు ప్రాంతీయ స్థాయిలో కాకుండా, జాతీయ స్థాయి అంశాలపై జరిగితే బీజేపీకి కొంత మెరు గైన అవకాశాలు ఏర్పడతాయి. మత, జాతీయవాద రాజకీయాలతో బీజేపీ జనాలను తనవైపు తిప్పుకోగలగడం దీనికి కారణం. 2019లో ముఖాముఖి పోరులో కాంగ్రెస్ నుంచి తొంభై శాతం సీట్లను బీజేపీ లాక్కోగలిగింది. యూపీలో బీజేపీ మును పటి స్థాయిలో సీట్లు సాధించగలిగితే, మిగిలిన చోట్ల ఫలితాలు ఎలా ఉన్నా కేంద్రంలో మెజారిటీకి కూతవేటు దూరంలోకి వచ్చేస్తుంది.
పట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశం 2024 ఎన్నికల హంగామాకు శ్రీకారం చుట్టింది. సిమ్లా సమావేశం నాటికి కూటమి... ప్రజలకు ఏ రకమైన సందేశం ఇవ్వాలి అన్న విషయంతో పాటు దాన్ని నియోజకవర్గాల వారీగా చేరవేసేది ఎవరు? ప్రణాళికలు, వ్యవస్థా గతమైన యంత్రాంగం వంటి వాటిని నిర్ధారించుకోవాలి.
లోక్‌సభ ఎన్నికల సినిమా అనేది ఇప్పడు రాష్ట్రాల్లో మాత్రమే నడవడం లేదని ప్రతిపక్ష కూటమి గుర్తించాలి. జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులను కూడా ప్రతిపక్ష కూటమి గుర్తించి మరీ తాము చెప్పదలచుకున్న విషయాలను చెప్పాల్సి ఉంటుంది. లేదంటే ప్రతిపక్ష పార్టీల సమావేశాలు మంచి ఫొటోలు తీసుకునేందుకు మాత్రమే ఉపయోగపడతాయి.
రాహుల్ వర్మ
వ్యాసకర్త ఫెలో, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, న్యూఢిల్లీ
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment