పశుగణన ఆరంభం
తెనాలి: అఖిల భారత పశుగణన శుక్రవారం నుంచి ఆరంభమైంది. ప్రతి ఐదేళ్లకోసారి డిపార్టుమెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండ్రీ, డెయిరీయింగ్ అండ్ ఫిషరీస్ (డీఏహెచ్‌డీఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పశు గణనను వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచే ప్రారంభించాల్సి ఉంది. ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు సన్నద్ధంగా లేనందున దాదాపు రెండునెలల ఆలస్యంగా ఎట్టకేలకు శుక్రవారం నుంచి ప్రారంభమైంది.
బ్రిటిష్ హయాం నుంచే..
భారతదేశంలో పశుగణనను బ్రిటిష్ హయాంలో 1919 నుంచే చేస్తున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి చొప్పున ఈ గణన చేపడుతున్నారు. ఇప్పటికి 20 పశుగణన(లైవ్‌స్టాక్ సెన్సెస్)లు పూర్తయ్యాయి. 21వ పశుగణనను శుక్రవారం ప్రారంభించారు. వ్యవసాయం, మత్స్యరంగం, అటవీ రంగాల్లోని మొత్తం ఆదాయంలో లైవ్‌స్టాక్ ఆదాయం 25.6 శాతం ఉంటుందని అంచనా. జీడీపీలో లైవ్‌స్టాక్ సెక్టారు భాగస్వామ్యం నాలుగు శాతంపైగానే ఉంటోంది. అందుకే కీలకమైన పశుగణనను ఎప్పటికప్పుడు చేపడుతున్నారు.
వీధుల్లో సంచరించే జంతువుల సహా...
ఆవులు, గేదెలతోపాటు గొర్రెలు, మేకలు, కోళ్లు, పందులు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు, పెంపుడు జంతువులతో సహా అన్ని జంతుజాలాలనూ వయసు, లింగంతో సహా గణిస్తారు. ఈసారి వీధుల్లో సంచరించే కుక్కలు, ఇతర జంతువులనూ లెక్కించనున్నారు. వీటితోపాటు రైతులు వాడే యంత్ర పరికరాలు, గడ్డి కత్తిరించే, గడ్డి కట్టలు కట్టే మిషన్లు వంటి పరికరాలతోపాటు, పాలు పితికే యంత్రాలతో సహా వివరాలను సేకరించనున్నారు. పశువుల సంతలు, పశువుల నీటితొట్టెలు, పశు దాణా తయారీకేంద్రాలు, పాలసేకరణ, శీతలీకరణ కేంద్రాలు, కోడిమాంసం/ మాంసం దుకాణాలు, జంతువుల మార్కెటింగ్ వంటి వివరాలనూ నమోదు చేయనున్నట్టు సమాచారం. గతంలో రెవెన్యూ శాఖ ఈ గణనను చేపట్టేది. అయితే లోటుపాట్లు లేకుండా సర్వే జరగాలనే ఉద్దేశంతో 2007 నుంచి గణనను ప్రభుత్వం పశుసంవర్ధక శాఖకు అప్పగించింది.
కలెక్టర్ ఆధ్వర్యంలోనే..
జిల్లాస్థాయిలో కలెక్టర్ పశుగణన అధికారిగా, డివిజన్ స్థాయిలో పశుసంవర్ధకశాఖ డెప్యూటీ డైరెక్టర్/అసిస్టెంట్ డైరెక్టర్, మండల స్థాయిలో పశువైద్యాధికారి సర్వే అధికారిగా ఉంటారు. ఎన్యూమరేటర్లుగా గోపాలమిత్రలు, వెటరనరీ పారా సిబ్బంది 185 మంది పశుగణాల లెక్కింపులో పాల్గొంటారు. పూర్తి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వెబ్, మొబైల్ యాప్‌లో వివరాలు సేకరించనున్నారు. 55 మంది సూపర్‌వైజర్లు పనిచేస్తున్నారు.
సుమారు రెండునెలల ఆలస్యంగా..! 185 మంది ఎన్యూమరేటర్ల నియామకం 55 మంది సూపర్‌వైజర్లకు బాధ్యత డిజిటల్ విధానంలో గణన ఈసారి వీధి కుక్కల సహా లెక్కింపు
20వ పశుగణన ప్రకారం
జిల్లాలో జీవాలు ఇలా..
జీవాలు సంఖ్య
ఆవులు 16,899
గేదెలు 1,98,009
గొర్రెలు 1,25,451
మేకలు 20,451
పందులు 1,194
పౌల్ట్రీ కోళ్లు 33,65,423
పక్కాగా పశుగణాల సర్వే...
జిల్లాలో 21వ అఖిల భారత పశుగణాల సర్వే శుక్రవారం నుంచి ఆరంభించాం. జిల్లాలోని 6.80 లక్షల గృహాల్లో పశుగణనకు 185 మంది ఎన్యూమరేటర్లు, 55 మంది సూపర్‌వైజర్లు విధుల్లో పాల్గొంటున్నారు. ఈసారి వీధికుక్కలతో సహా వీధుల్లో సంచరించే అన్ని రకాల జంతువులు, రైతులు వాడే వ్యవసాయ పరికరాలు, యంత్రపరికరాల లెక్కింపునూ చేర్చటం ప్రత్యేకత. పశుగణన సర్వే పక్కాగా చేసేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం.
– డాక్టర్ ఒ.నరసింహారావు,
జాయింట్ డైరెక్టర్, పశుసంవర్ధకశాఖ
Comments
Please login to add a commentAdd a comment