పురస్కారం స్వీకరించిన జీఎంసీ కమిషనర్
నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం స్వనిధి ద్వారా గుంటూరు నగరపాలక సంస్థ.. 24,197 దరఖాస్తులకుగాను బ్యాంక్‌ల ద్వారా 21,594 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించడం ద్వారా దేశంలో తొలి స్థానంలో నిలిచింది. దీంతో మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ చేతులమీదుగా అవార్డ్, ప్రశంసా పత్రాన్ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అందుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో గుంటూరు నగరపాలక సంస్థకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
వరగాని(కాకుమాను): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మండలంలోని వరగాని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు అంటేనే తల్లిదండ్రులకు ఎంతో నమ్మకమని చెప్పారు. ప్రతి ఉపాధ్యాయుడు బడిలోని పిల్లలను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య నేర్పాలన్నారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రతి రోజు అందించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి మధ్యాహ్న భోజనం తినేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. వారి ప్రగతి వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఆర్‌డీఏ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగింపు
తాడికొండ: సీఆర్‌డీఏ భూముల్లో అక్రమ నిర్మాణాలను మంగళవారం అధికారులు తొలగించారు. ఉద్దండరాయునిపాలెం గ్రామంలో లారీలు, ట్రాక్టర్లు నిలిపేందుకు కొంతమంది షెడ్డులు నిర్మించడంతో వాటిని జేసీబీల సాయంతో కూల్చివేశారు. స్వచ్ఛందంగా తొలగించుకుంటామని కొందరు కోరడంతో వెసులుబాటు కల్పించారు. సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.విశ్వేశ్వరనాయుడు ఆధ్వర్యంలో తొలగింపు చేపట్టారు. పలువురు అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
యార్డుకు 43,346
బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 43,346 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 41,651 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ. 16,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 18,200 వరకు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment