మిర్చి యార్డు పర్సన్ ఇన్‌చార్జిగా జేసీ
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు పర్సన్ ఇన్‌చార్జిగా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ నియమితులయ్యారు. ఈ మేరకు మార్కెటింగ్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ శుక్రవారం జీఓ నంబర్ 671 జారీ చేశారు. ఇప్పటి వరకు యార్డు పర్సన్ ఇన్‌చార్జిగా కొనసాగిన మార్కెటింగ్‌శాఖ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు స్థానంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజను నియమిస్తూ జీఓ జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో పర్సన్ ఇన్‌చార్జిగా భార్గవ్ తేజ బాధ్యతలు చేపట్టనున్నారు. గుంటూరు మార్కెట్ యార్డుకు చైర్మన్ నియామకం జరిగే వరకు ఆయన పర్సన్ ఇన్‌చార్జిగా కొనసాగనున్నారు.
ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలి
నెహ్రూనగర్: రాష్ట్రంలో వర్గీకరణ అమలయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగ భర్తీలు చేపట్టవద్దని సీఎం చంద్రబాబుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడే వర్గీకరణ చేశారని, ఇప్పుడు కూడా ఆయన ద్వారానే వర్గీకరణ జరుగుతుందన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి ఉద్యోగ భర్తీలు చేయవద్దని చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం సీఎంను కలవనున్నట్లు ఆయన తెలిపారు.
కాలువలో పడి
రైతు గల్లంతు
తెనాలిరూరల్: కాలువలో పడి రైతు గల్లంతైన ఘటన తెనాలి మండలం కొలకలూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన 55 ఏళ్ల ఏడుకొండలు పొలానికి మందు కొట్టేందుకు శుక్రవారం సైకిల్‌పై వెళుతుండగా సైకిల్‌కు తగిలించిన కవరు తెగి కొమ్మమూరు కాలువ గట్టు వెంబడి పడింది. కవరు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి ఏడుకొండలు గల్లంతయ్యాడు. రూరల్ ఎస్‌ఐ సీహెచ్ ప్రతాప్ ఘటనా స్థలాన్ని పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పుల సంఖ్య పెంచాలి
వైద్య ఆరోగ్యశాఖ రీజినల్
డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర
రాజుపాలెం: ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాల సంఖ్య పెంచాలని గుంటూరు వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్(ఆర్‌డి) డాక్టర్ సుచిత్ర సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. రీజినల్ డైరెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, పిల్లలకు సరైన సమయలో టీకాలు వేసేలా సిబ్బందికి అవగాహన కల్పించాలని డాక్టర్ రవితేజ నాయక్‌కు సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నరసింహారావు, హెల్త్ సూపర్‌వైజర్లు జీవన్‌రావు, ఉషారాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక పరిష్కార వేదిక
నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా నాలుగో శనివారం నిర్వహించే ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక శనివారం ఉదయం 10గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజలు ప్రత్యేక పరిష్కార వేదికను వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
రేపు గుంటూరులో రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రస్థాయి 5వ మాస్టర్ స్విమ్మింగ్ పోటీలు ఆదివారం గుంటూరులో నిర్వహిస్తున్నట్టు పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీలలో 25 సంవత్సరాల వయస్సు నుంచి 80 సంవత్సరాల వయస్సు వరకు వివిధ కేటగిరీలలో మహిళలు, పురుషులకు నిర్వహిస్తున్నట్టు వివరించారు. వివరాలకు 8296374963 నంబరులో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment