సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
తాళ్ళాయపాలెం (తాడికొండ): ఈ నెల 7వ తేదీన తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్,నాగలక్ష్మి, ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అఽధికారులతో చర్చించి పలు సూచనలు, సలహాలిచ్చారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ... తాళ్ళాయపాలెంలో 7వ తేదీన సీఎం చేతుల మీదుగా 400/200 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం కానుందని తెలిపారు. అనంతరం ఇతర జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు కూడా సీఎం వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు చేయనున్నారని చెప్పారు. ట్రాక్స్‌కో ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, గుంటూరు ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో శిల్ప, తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం ప్రారంభించనున్న సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పది పరీక్ష ఫీజు చెల్లింపునకు 18 వరకు అవకాశం
యడ్లపాడు: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు ప్రభుత్వం గడువు పెంచింది. ఈనెల 18వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అపరాధ రుసుంతో వచ్చే నెల వరకు చెల్లించుకోవచ్చని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ తెలిపారు. ఈనెల 19 నుంచి 25వ తేదీలోగా రూ.50 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించవచ్చు. 26 నుంచి వచ్చే నెల మూడో తేదీలోగా రూ.200 అపరాధ రుసుంతో, వచ్చే నెల నాలుగు నుంచి 10వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు.
అర్హులందరికీ సిలిండర్లు
తెనాలి రూరల్: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణంలోని యడ్ల లింగయ్య కాలనీ, బాలాజీరావుపేట ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన దీపం–2 పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సిలిండర్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఆయన వెంట ఉన్నారు. బాలాజీరావుపేట అయ్యప్ప స్వామి గుడి సమీపంలో పంపిణీ సందర్భంగా ఆయన గ్యాస్ పొయ్యిని వెలిగించగా.. లబ్ధిదారు మల్లవరపు శివమ్మ టీ కాచి మంత్రి, జిల్లా కలెక్టర్ సహా అధికారులకు అందజేశారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, డీఎస్‌వో కోమలి పద్మ, సీఎస్‌డీటీ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
పురస్కారానికి పెనుగొండ లక్ష్మీనారాయణ ఎంపిక
నగరంపాలెం: అజో విభో కందాళం ఫౌండేషన్ ప్రతి సంవత్సరం రచయితకు విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. వచ్చే ఏడాది 2025కిగాను అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను పురస్కారానికి ఎంపిక చేసినట్లు అరసం ఏపీ ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3, 4, 5వ తేదీల్లో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో జరగబోయే సభలో ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.
మందుబాబులకు జైలుశిక్ష
నగరంపాలెం: మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన ఇద్దరికి ఐదు రోజులు జైలు శిక్ష విధిస్తూ ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.లత మంగళవారం తీర్పు చెప్పారు. పశ్చిమ ట్రాఫిక్ పీఎస్ సీఐ సీహెచ్ సింగయ్య ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment