తారస్థాయికి కూటమి దుశ్చర్యలు
నగరంపాలెం: రాష్ట్రంలో ఏ సమస్యలేనట్టుగా సూపర్ సిక్స్ అమలు చేయలేదనే చర్చ ఉండకూడదనే ఒక వింత పోకడను కూటమి ప్రభుత్వం అనుసరిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగంపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ శనివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాయలంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. బాలికలు, మహిళలు, యువతులపై దాడులు, లైంగిక దాడులు, హత్యలు కూటమి ప్రభుత్వం వచ్చాక తారస్థాయికి చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇటువంటి దుశ్చర్యలు 90 నుంచి వందకు చేరాయని ఆరోపించారు. అయితే ఈ తరహా ఘటనలపై చర్చ రాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పెద్దలు వైఎస్సార్ సీపీ సోషల్ మీడియాకు సంబంధించి 111 మంది కార్యకర్తలను అర్ధాంతంగా తీసుకువచ్చి, పోలీస్‌స్టేషన్లలో నిర్భంధిస్తున్నారని అన్నారు.
రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం..
సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులతో పలు సెక్షన్లు నమోదు చేసి న్యాయమూర్తుల ముందు పోలీసులు హాజరుపరుస్తున్నారని చెప్పారు. రోజుల తరబడి పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఈ తరహా ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇంత పెద్దఎత్తున కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం రాష్ట్రంలో ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్రంలోని అనేక సమస్యలను గాలికొదిలేసి, ఇదే ప్రధాన సమస్యగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై, వారి కుటుంబంపై, వైఎస్సార్ సీపీపై పోస్టులను పెడుతున్న వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రి విడదల రజనీపై ట్రోల్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గతంలో వినతిపత్రం అందించామని ఆయన గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.
రాష్ట్రంలో ఏ సమస్య లేనట్లుగా అక్రమ కేసుల పరంపరకు తెరలేపారు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకూడదనే ఈ అక్రమ కేసులు ఇప్పటికే 111 మంది వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అక్రమ కేసులు నిరసిస్తూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం
భార్య భర్తలకుచిత్రహింసలు తగదు..
పాత పోస్ట్ పెట్టారనే నెపంతో పెద్దింటి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఏడెనిమిది పోలీస్‌స్టేషన్లకు తిప్పి, అవే కేసులను ఆయా పోలీస్ స్టేషన్లల్లో రిజిస్టర్ చేశారని మండిపడ్డారు. సిరిసిల్ల వేములవాడలో అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లిన ఆ కుటుంబంపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని అన్నారు. ఆమె ఏమైనా తీవ్రవాదా.. లేదా బాంబులు పెట్టిందా.. లేదా హింసాత్మక సంఘటనలకు పాల్పడిందా అని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోస్ట్ పెట్టడం నచ్చకపోతే కేసు నమోదు చేస్తే సరిపోతుందికదా అని అన్నారు. ప్రస్తుతం భార్య భర్తలను జైలుకి పంపించారని, వారు ఉగ్రవాదులా, లేదంటే ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏమైనా కుట్ర పన్నారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పోలీస్ అధికార యంత్రాంగం చంద్రబాబు, లోకేష్ గుప్పిట్లో ఉందని ఆరోపించారు. మానవ హక్కులను హరించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతుంటాయని, ఆ తర్వాత సస్పెన్షన్‌లు ఉంటాయని, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుందని పోలీసులకు గుర్తు చేశారు. జిల్లా ఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ సమన్వయకర్తలు షేక్ నూరిఫాతిమా (గుంటూరు తూర్పు), అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), వనమా బాలవజ్రబాబు (తాడికొండ), దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి), మేయర్ కావటి మనోహర్‌నాయుడు, మిర్చియార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్లు అంబేడ్కర్, మొహమూద్, ఈచంపాటి ఆచారి, యాట్ల రవి, బూసి రాజలత, పద్మావతి, నాయకులు అగ్గిపెట్టి రాజు, పునూరి నాగేశ్వరరావు, మర్రి సత్యం, వివిధ విభాగాల నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment