తాడోపేడోకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తాడేపల్లిలో 31 ఏళ్ల కిందట మూతపడిన సిమెంట్ కంపెనీ కార్మికులకు రావాల్సిన బకాయిలు, నష్టపరిహారం కోసం కార్మికులు ఆందోళన ఉద్ధృతం చేశారు. తమకు న్యాయం చేయకుంటే ఆమరణ దీక్షకు సిద్ధమని ప్రకటించారు. అయినా యాజమాన్యాలు, స్థలం కొనుగోలు చేసిన వారు కోర్టు తీర్పునూ పట్టించుకోకపోవడంతో సిమెంట్ ఫ్యాక్టరీ స్థలంలో పాకలు వేశారు. రోజూ నిరసన దీక్షలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు స్థలం కొన్నవారందరూ ప్రభుత్వంలో ఉండటంతో కార్మికులకు న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పుడు కార్మికులను దగ్గరకు కూడా రానీయడం లేదు.
వివరాలు కోరి అలసత్వం
ఇటీవల ఈ భూములను చదును చేయడం కోసం వచ్చిన ఎన్‌ఆర్‌ఐ సంస్థ పొక్లెయిన్లను కార్మికులు అడ్డుకుని వెనక్కి పంపారు. ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు కార్మికులతో చర్చలు జరిపి ఎంత రావాలో వివరాలు ఇవ్వాలని కోరారు. వివరాలు ఇచ్చి నాలుగు నెలలు దాటినా స్పందన లేకపోవడంతో కార్మికులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. కార్మిక నాయకులపై బైండోవర్లు పెట్టించడం ద్వారా వారి ఆందోళనను అణిచివేయడానికి కూటమి ప్రభుత్వం యత్నాలు చేస్తోంది. ఎన్నికల ముందు సిమెంట్ కంపెనీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ న్యాయం చేస్తారనే ఆలోచనతో ప్రజా దర్బార్‌కూ కార్మికులు వెళ్లారు. లోకేష్ డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ ముఖం చాటేశారు. ఆయన సిబ్బంది కార్మికులను రావద్దని కరాఖండీగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ భూములన ఏసీసీ సిమెంట్స్ నుంచి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న బాలాజీ గురుప్రసాద్ అనే వ్యక్తి ఒక్కొక్కటిగా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతుండటంతో కార్మికులు ఆందోళన చెంది భూముల ఆక్రమణకు సిద్ధపడ్డారు.
అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీని 1989లో ఎఫ్‌ఐఎల్‌కు తర్వాత హెచ్‌ఎంపీ అనే సంస్థలకు పది రూపాయల స్టాంప్ పేపర్‌పైన బదిలీ చేసింది. 1993లో ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్రకటించి అదే ఏడాది మే 29న అర్ధరాత్రి అక్రమ లాకౌట్ ప్రకటించింది. స్పచ్ఛంద ఉద్యోగ విరమణకు సంతకాలు చేసిన కార్మికులకూ డబ్బులు ఇవ్వకుండా మోసం చేసింది. తర్వాత ఈ భూములను కోల్‌కతా కోర్టులో వేలం వేస్తే ప్రస్తుత మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీతోపాటు మరికొందరు కలిసి కొన్నారు. తర్వాత దీన్ని ఎన్‌ఆర్‌ఐ అకాడమీకి అమ్మినట్లు చూపించారు. ఆ సమయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జోక్యం చేసుకుని ఫ్యాక్టరీని పూర్తిగా తొలగించి, స్థలాన్ని చదును చేయించారు. కార్మికులపై బెదిరింపులకు దిగారు. 2015లో కార్మికులకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. సెంట్రల్ లేబర్ కోర్టు, హైకోర్టులు ఏసీసీ కార్మికులకు రూ.43 కోట్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాయి. ఈ ఆదేశాలను అమలు చేసే నాథుడు లేకుండా పోయాడు. భూమి కొన్నవారు కార్మికులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ భూములు కొన్నవారు డబ్బులు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఇక్కడ ఎకరం పది కోట్ల రూపాయలపైనే ఉంది. 130 ఎకరాలకుపైనే ఫ్యాక్టరీ భూములు ఉన్నాయని, అందులో పది ఎకరాలు అమ్మినా తమ బకాయిలన్నీ తీరిపోతాయని కార్మికులు చెబుతున్నారు. ఇప్పటికే 170 మంది వరకూ కార్మికులు అర్ధాకలితో అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడ్డారు.
తాడేపల్లి సిమెంట్ కార్మికుల
ఆందోళన ఉద్ధృతం
న్యాయం చేయకపోతే ఆమరణ
దీక్షకు సిద్ధమని ప్రకటన
రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే
ఫ్యాక్టరీ స్థలం ఆక్రమణకు అల్టిమేటం
ఇప్పటికే స్థలంలో పాకలు వేసి
నిరసన దీక్షలు చేస్తున్న కార్మికులు
ఫ్యాక్టరీ స్థలాన్ని కొనుగోలు చేసిన
బాలశౌరీ, ఆలపాటి రాజా!
ఎన్నికల ముందు హామీ ఇచ్చి
తర్వాత గాలికి వదిలేసిన లోకేష్
బకాయిలు చెల్లించండి
333 మంది ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులను రోడ్డున పడేశారు. న్యాయస్థానాలు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. అయినా న్యాయం జరగడం లేదు. అనధికారికంగా ఫ్యాక్టరీ భూములు అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా బకాయిలు చెల్లించాలి. లేదా భూములు మాకు అప్పగించాలి.
– మెల్లెంపూడి ఆశీర్వాదం
Comments
Please login to add a commentAdd a comment