విద్యుత్ సబ్‌స్టేషన్ గేటుకు తాళాలు
● ఇనుపవైర్లతోనూ గేట్లు కట్టేసిన వైనం ● అధికారుల అత్యుత్సాహం ● వైఎస్సార్ సీపీ శ్రేణులు వస్తున్నారని దుశ్చర్య ● డిమాండ్లతో కూడిన పత్రం ఇవ్వకుండా చేసేందుకు పన్నాగం ● స్థానికులు ప్రశ్నించడంతో తాళాలు తీసిన సిబ్బంది ● కూటమి నేతల ప్రసన్నం కోసమేనని విమర్శలు
ప్రత్తిపాడు: విద్యుత్ సబ్‌స్టేషన్ మెయిన్ గేటుకు తాళాలు వేయించి విద్యుత్‌శాఖ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ అధికారీ వ్యవహరించని విధంగా వ్యవహరించి విమర్శలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ పోరుబాటకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీగా సబ్ స్టేషన్‌కు బయల్దేరారు. విషయం తెలుసుకున్న ఏఈ గౌతమ్ తమ సిబ్బందితో విద్యుత్ సబ్ స్టేషన్ మెయిన్ గేట్‌కు తాళాలు వేయించారు. ఎవరూ లోపలకు రాకుండా ఇనుప వైర్లతో గేట్లు కట్టి వేశారు. ఇంతలో అక్కడకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు గేట్లుకు తాళాలు వేసి ఉండడంతో అవాక్కయ్యారు. స్థానికులు సిబ్బందిని ప్రశ్నించడంతో ఏఈ తాళాలు వేయమన్నారని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో సిబ్బంది హడావుడిగా వచ్చి తాళాలు తీశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు డిమాండ్లతో కూడిన పత్రం ఇవ్వడానికి వస్తున్నందునే ఇలా తాళాలు వేశారని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. కూటమి నాయకుల మెప్పు పొందడంతోపాటు వారి కళ్లలో ఆనందం చూసేందుకే విద్యుత్ అధికారులు ఇలా కార్యాలయానికి గతంలో ఎన్నడూ లేని విధంగా తాళాలు వేయించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment